కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో తెలీదు గానీ.. `మహర్షి` విడుదల అవ్వకముందే.. సక్సెస్మీట్కు ముహూర్తం ఫిక్సయిపోయింది. ఈనెల 9న మహర్షి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అప్పుడే సక్సెస్ మీట్ వేదిక, తేదీ ఖరారైపోయాయి. ఈనెల 18న విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నామని నిర్మాతలలో ఒకరైన పీవీపీ తెలిపారు. ఈ వేడుకకు మహేష్‌తో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు అంతా వస్తారని, సక్సెస్ మీట్‌ని ఘనంగా నిర్వహించనున్నామని పీవీపీ అన్నారు.
మరో నిర్మాత దిల్‌రాజు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. “అభిమానులు ఈ సినిమా నుంచి ఎంతైనా ఆశించండి. మీ అంచనాలన్నీ మేం తీరుస్తాం. 9వ తేదీన అభిమానులు, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అంతా.. కాలర్ ఎగరేసుకోవడం ఖాయం” అన్నారు. ఈ సినిమా డబుల్ పాజిటీవ్ చూసినప్పుడే నమ్మకం రెట్టింపు అయ్యిందని, వెంటనే వంశీ పైడిపల్లికి వాట్సప్‌లో దండం సింబల్ పంపానని, వెంటనే మహేష్‌ని కలుసుకున్నానని చెప్పారు. “సెట్‌కి వెళ్లి అందరినీ హగ్ చేసుకున్నా. కానీ మహేష్‌ని హగ్ చేసుకోవాలా? వద్దా? అని ఆలోచించా. ఎందుకంటే మహేష్ సాధారణంగా షేక్ హ్యాండ్ మాత్రమే ఇస్తారు. అందరికీ హగ్ ఇచ్చారు.. నాకు ఇవ్వరా? అంటూ మహేష్ అడిగారు. వెంటనే ఆయనకీ హగ్ ఇచ్చాను. వంశీ చేసిన అయిదు చిత్రాల్లో ఇదే అత్యుత్తమ చిత్రం” అన్నారు.