రాజ్యాంగబద్ధ సంస్థలన్నా, వ్యవస్థలన్నా వైకాపా నేతలకు చిన్నచూపుగా మారిపోయిందనడానికి ఎంపీ విజయసాయి రెడ్డి తీరే సాక్ష్యం అని చెప్పొచ్చు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం వరకూ ఆయనకి ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్లిపోయి పనులు చక్కబెట్టుకుంటున్న తీరు అందరికీ తెలిసిందే. అలా వెళ్లడం తప్పు అని ఎవ్వరూ అనరు. కాకపోతే, ప్రజా సమస్యల కోసమో, లేదంటే ఇతర ప్రభుత్వ సంబంధ కార్యక్రమాల కోసమో వెళ్తే మంచిదే. కానీ, కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో వాడేసుకునే విధంగా ఆయన వ్యవహారించిన తీరు అందరూ గమనిస్తున్నదే. చెయ్యాల్సివన్నీ ఆయన చేస్తూ… ఏపీ ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తుండటం విశేషం. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన విజయసాయి…. వ్యవస్థల్ని ముఖ్యమంత్రి అడ్డగోలుగా వాడుకుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ… ఇంతవరకూ అన్ని వ్యవస్థల్లోనూ తన వ్యక్తులు ఉండే విధంగా చూసుకోగలిగారుగానీ, ఎన్నికల సంఘంలో తన వారిని ఆయన పెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఒక కమిషనర్ ను తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలు చంద్రబాబుకి ఉండేవి కావు కదా అంటూ విమర్శించారు. ఈసీలో తనవాడు ఒకడుంటే తనకు ఇన్ని సమస్యలు వచ్చుండేవి కాదని చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల దగ్గరవాపోయారని తెలిసిందంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ, విజిలెన్స్, జ్యుడిషియరీ లాంటి అన్ని చోట్లా మన వాళ్లను పెట్టగలిగాననీ, ఈసీలో మాత్రం ఒకడిని పెట్టలేకపోయానని బాధపడుతున్నారని విమర్శించారు.
వ్యవస్థలంటే ఎంత చిన్నచూపో అని చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు. వ్యవస్థల్లో తమవారిని పెట్టుకుంటేనే పనులు అయిపోతాయనే మైండ్ సెట్ తో విజయసాయి ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైకాపా ఫిర్యాదు చేయడమే ఆలస్యం, వెంటనే చర్యలకు దిగిపోయే విధంగా ఈసీ స్పందించిన తీరు, ఇప్పుడు ఈయన చేసిన ట్వీట్ ను చూసుకుంటే… అక్కడ తమవారు ఉన్నారని విజయసాయి చెప్పకనే చెబుతున్నట్టే కదా! ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాజ్యాంగబద్ధ వ్యవస్థలూ సంస్థలు పట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిది అనేది బయటపడుతోంది.