ఇంటర్ పరీక్షల అవకతవకలు బయటపడటంతో.. ప్రభుత్వం సంస్కరణలకు రంగం సిద్ధం చేసింది. మొత్తం పరీక్షల విధానాన్నే మార్చాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా స్వతంత్ర ప్రతిపత్తితో ఓ సంస్థను ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల బాధ్యతలు తీసుకున్న ఇంటర్ బోర్డు ల స్థానంలో కొత్తగా తెలంగాణ ఎగ్జామినేషన్ అథారిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టెన్ ప్లస్ టూ విధానం అమల్లో ఉందని … తెలంగాణలోనూ అదే విధానం అమలు చేయాలన్న సూచనలు ప్రభుత్వానికి ఎక్కువగా అందాయి.
ఎస్సెస్సీ బోర్డు కేవలం పరీక్షలను మాత్రమే నిర్వహిస్తోంది..కానీ ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణతో పాటు,కొత్త ప్రైవేటు కాలేజీలకు అనుమతులు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల పర్యవేక్షణ చేస్తోంది. అందుకే స్వతంత్ర పరీక్షల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేయడమే బెటరని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్ బోర్డు నుండి పరీక్షల నిర్వహణను తప్పించి ఇతర విధులను యథావిధిగా కొనసాగించాలని పదవ తరగతి పరీక్షల కోసమే ఉన్న ఎస్సెస్సీ బోర్డు అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలతో పాటు, ఎంసెట్ పరీక్షలు, ఇతర పరీక్షలు కూడా నిర్వహించేలా కొత్తగా అథారిటీని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కసరత్తు చేశారు.
ఐఐటీ, జేఈఈ, జీఆర్ఈ పరీక్షలు నిర్వహించే సంస్థల పనితీరును పరిశీలించి కొత్త స్వతంత్ర సంస్థకు తుదిరూపు ఇవ్వనున్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ణానంతో ఉన్న అధికారులను నియమించనున్నారు. ప్రభుత్వం నుండి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ ఉండేలా అథారిటీని నియమించే అవకాశం ఉంది. ఓ తప్పు జరిగిన తర్వాత అది ఎలా జరిగిందనే దాన్ని తెలుసుకుని.. దిద్దడం కన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఆ వ్యవస్థలనే రద్దు చేయాలనుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖలపై ఇప్పటికే.. రివ్యూ జరిగిందని.. వాటిని రద్దు చేస్తారని అంటున్నారు. తాజాగా..ఆ జాబితాలో ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు చేరాయి.