ఎన్నికలు పూర్తయిన మరుక్షణం నుంచి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో వైకాపా నేతలు ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారనీ, ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు పెట్టేసుకున్నారనీ, చివరికి మంత్రులుగా కొంతమంది జాబితా తయారైపోయిందంటూ వైకాపా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో కొన్ని ప్రాంతాల్లో వైకాపా శ్రేణులు చేస్తున్న హడావుడీ ఈ మధ్య ఎక్కువైంది. తామ నాయకుడే కాబోయే మంత్రి అంటూ కొన్ని నియోజక వర్గాల్లో వైకాపా శ్రేణులు తీవ్ర ప్రచారం చేస్తుండటం, వాటిని సదరు నాయకులు ఖండించకపోవడం కూడా చూస్తున్నాం. ఈ అంశం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చినట్టు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లాలకు చెందిన పార్టీ ఇన్ ఛార్జ్ లను తాజాగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కి పిలిపించారని సమాచారం. ఆ సమావేశంలోనే కాబోయే మంత్రులు అంటూ కొంతమంది నాయకుల అనుచరుల చేస్తున్న ప్రచారం ప్రస్థావనకి వచ్చిందట! ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ మంత్రి వర్గం లాంటి మాటలు వద్దనీ, అలాంటి ప్రచారాలని వెంటనే కట్టిపెట్టాలంటూ ఇన్ ఛార్జ్ లకు జగన్ వార్నింగ్ ఇచ్చారని వైకాపా వర్గాలకు చెందిన కొందరు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారం, ప్రభుత్వ ఏర్పాట్లు ఇలాంటి అంశాలపై ప్రచారాలూ ప్రకటనలూ వద్దంటూ మందలించారట. ఫలితాలు వచ్చాక జరగాల్సినవన్నీ జరుగుతాయనీ, ఈలోపుగానే హడావుడి ఎందుకని అన్నారట. దీంతో క్షేత్రస్థాయిలో ఈ ప్రచారాల హోరుకు కొంత తెరపడినట్టు తెలుస్తోంది.
మంత్రులైపోతామని కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పుకుంటూ ఉంటే, వారిని పిలవకుండా జిల్లా పార్టీ ఇన్ ఛార్జ్ లకు క్లాస్ తీసుకుంటే ఉపయోగం ఏముంటుంది? ఇన్ ఛార్జులు ఏం చేస్తారు? ఫలితాలు వచ్చేదాకా ఆగాలంటూ అభ్యర్థులకు చెప్పాలి. నిజానికి ఈ ప్రచారం మొదలుపెట్టిందే జగన్! ఎన్నికలు ముగియగానే అధికారంలోకి వచ్చేస్తున్నామని ధీమాగా చెప్పిందే ఆయన! ఓట్ల లెక్కింపు వరకూ ఫలితాలపై మాట్లాడను అని ఆయనే చెప్పి ఉంటే…. ఈ పరిస్థితి ఉండేది కాదు. విజయసాయి రెడ్డి మొదలుకొని ఇతర నాయకులు కూడా ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేస్తుంటే… క్షేత్రస్థాయి కేడర్ లో మితిమీరిన ధీమా పెరగక ఏమౌతుంది?