కాపులకు రిజర్వేషన్ల కోరుతూ ఒక పక్క ఆంధ్రాలో ఉద్యమం మొదలవగా, ఆంధ్రా, తెలంగాణాలో వైద్య విద్యా కోర్సులలో రిజర్వేషన్లపై హైకోర్టు చాలా సంచలన తీర్పువెలువరించింది. ఎం.బి.బీ.ఎస్. బీడిఎస్ వైద్య విద్యా కోర్సులలో బీ కేటగిరి క్రింద వచ్చే యాజమాన్య కోటాలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వనవసరం లేదని హైకోర్టు తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారం ఎటువంటి నిబంధన గానీ, ప్రభుత్వాల నుండి అధికారికంగా ఎటువంటి ఆదేశాలు గానీ లేనందున యాజమాన్య కోటాలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఏ కేటగిరీ క్రిందకు వచ్చే కన్వీనర్ కోటాలో మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
గత ఏడాది ఏపి, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ కూడా యాజమాన్య కోటాలో రిజర్వేషన్లకు వీలు కల్పిస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ని తొలగిస్తూ జి.ఓ.లు జారీ చేసాయి. ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలకి మేలు చేకూర్చేందుకే ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకొన్నాయని ఆరోపిస్తూ రెండు రాష్ట్రాలలోని అనేక మంది విద్యార్ధుల తల్లి తండ్రులు, ఏపి బిసి సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసాయి.
అలాగే యాజమాన్య కోటాలో ఫీజులను రూ. 2.4 లక్షల నుంచి ఒకేసారి రూ. 9 లక్షలకు పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొందరు హైకోర్టులో సవాలు చేసారు. ఆ పిటిషన్లను కూడా విచారణకు చేపట్టిన జస్టిస్ సుబాష్ రెడ్డి, జస్టిస్ శంకర నారాయణలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే వైద్య కళాశాలలలో ప్రవేశాలు కూడా పూర్తయి, తరగతులు కూడా జరుగుతున్నందున ఈ సమయంలో తాము ఫీజు పెంపు విషయంలో జోక్యం చేసుకోలేమని ఈ మధ్యనే తేల్చి చెప్పింది. పిటిషనర్లలో కొందరు హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.