తుఫాను ముంచుకొస్తుండటంతో ఎట్టకేలకు ఎన్నికల సంఘం స్పందించిందని అనుకోవచ్చు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎవ్వరూ ఎలాంటి రివ్యూ నిర్వహించకూడదనీ, సాధారణ పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన సమీక్షలు చేయకూడదంటూ ఈసీ కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడి, కరువు పరిస్థితులపై రివ్యూ చేసేందుకు ఏపీ వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నిస్తే… అధికారులు రాలేదు. కారణం కోడ్ అమల్లో ఉండటమే. కమిషనర్లు కూడా వెనుదిరిగారు. ఈ పరిస్థితిపై ఇప్పుడు ఈసీ దృష్టి సారించింది.
తుఫాను ప్రభావంతోపాటు రాష్ట్రంలో కరువు, ఇతర ప్రకృతి వైపరిత్యాలకు సంబంధించిన పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి సోమిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతోపాటు కమిషనర్లు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కోడ్ అమల్లో ఉంది కాబట్టి, ప్రభుత్వ కార్యాలయ భవనాలు, వసతులు వాడనివ్వకూడదంటూ వైకాపా ఫిర్యాదు చేసిన సంగతీ తెలిసిందే. అయితే, రేపు జరుగుతున్న సమీక్ష సమావేశం మంత్రి సోమిరెడ్డి ఛాంబర్ లోనే జరుగుతుందని సమాచారం.
ఫొణి బీభత్సం సృష్టించబోతోందని తెలియగానే ఒడిశాలో కొన్ని జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అదే సమయంలో ఏపీకి చెందిన మూడు మూడు జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిసినా కూడా, కోడ్ సడలింపుపై స్పందించింది లేదు. ఇప్పుడు మంత్రి సమావేశానికి ఇచ్చిన అనుమతులేవో నిన్ననే ఇచ్చి ఉంటే… ఇంతవరకూ ఈసీపై వెల్లువెత్తుతున్న విమర్శల తీవ్ర కొంతైనా తగ్గి ఉండేది. అంతేకాదు, తుఫాను అనుకోని విపత్తు. హఠాత్తుగా వచ్చింది. ఎండలు ముదరడంతో రాష్ట్రంలో చాలాచోట్ల సాగు, తాగునీటికి ఇబ్బందులున్న పరిస్థితి ఉంది. వీటిపై సమీక్ష నిర్వహిస్తామనే మంత్రి సోమిరెడ్డి మొదట్నుంచీ ప్రయత్నించింది. ఈ సమస్యలు కూడా అత్యంత తీవ్రమైనవే. ఏదైతేనేం, ఈసీ స్పందించింది, చాలు.