ఓ సినిమా ఫంక్షన్‌ని అతిథిగా వెళ్లినవాళ్లు ఏం చెబుతుంటారు..? పోస్టర్ బాగుంది.. ట్రైలర్ అదిరిపోయింది.. ఈ సినిమా సూపర్ హిట్టు అవ్వడం ఖాయం.. అని పొగడ్తలతో ముంచెస్తుంటారు. అది కామన్ కూడా. అతిథిగా వెళ్లినందుకు ఇలాంటి పొగడ్తల కార్యక్రమం పెట్టుకోవాల్సిందే. సభా మర్యాదకైనా మెచ్చుకోవాల్సిందే. కానీ ఓ సినిమా ఫంక్షన్‌కి అతిథిగా వెళ్లి.. ‘ఇదేం సినిమా.. ఇలాంటి సినిమాలకు నన్ను పిలుస్తారా?’ అంటూ దర్శక నిర్మాతలమీద ‘కయ్…. ‘ అంటే..? ఈరోజు అదే జరిగింది.
‘డిగ్రీకాలేజ్’ అనే ఓ సినిమా ఫంక్షన్‌కి జీవిత అతిథిగా వెళ్లింది. ట్రైలర్ చూసి.. షాక్ తింది. ఎందుకంటే ఆ సినిమా నిండా బూతులే. పైగా శృంగారం డోసు మరింత ఎక్కువగా ఉంది. అది చూసి జీవితకు కోపం వచ్చింది. ‘ఇలాంటి బూతు సినిమా తీస్తారా? తీసి నన్ను అతిథిగా పిలుస్తారా’ అంటూ దర్శకుడ్ని నిర్మాతనీ స్టేజీపైనే కడిగి పారేసింది. దాంతో దర్శక నిర్మాతలు జీవితకు సర్దిచెప్పలేక నానా ఇబ్బందీ పడ్డారు. ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడేసి అక్కడి నుంచి వచ్చేసింది జీవిత. ఇటీవల ‘మా’ ఎన్నికలలో జీవిత గెలిచిన సంగతి తెలిసిందే. దాంతో చిన్న సినిమాల ఫంక్షన్లకు జీవితని అతిథిగా పిలుస్తున్నారు. అందులో ఇదొకటి. వెళ్లాం కదా అని తనకు ఇష్టం లేకపోయినా.. పొగిడి రాకుండా – మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి వచ్చిన జీవితను అభినందించాల్సిందే. ఇలాంటి సినిమాలకు అతిథుల్ని పిలుచుకుంటున్నప్పుడు దర్శక నిర్మాతలు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి. వెళ్లేటప్పుడు సినీ సెలబ్రెటీలూ ఆయా సినిమాల గురించి ఆరా తీయాలి. లేదంటే ఇలానే జరుగుతుంది.