ఫిర్యాదులు చేయడంలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ముందుంటారని అందరికీ తెలిసిందే! నిన్నమొన్నటి వరకూ టీడీపీ ప్రభుత్వం మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంలో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు పోలీసు వ్యవస్థపై పడ్డారు! పోలీస్ శాఖలో పదోన్నతకు సంబంధించిన జాబితా రూపకల్పన మొత్తం అవకతవకలమయం అంటూ తాజాగా గవర్నర్ నర్సింహన్ కు ఫిర్యాదు చేశారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారికే ప్రమోషన్లు వచ్చేలా ఒక జాబితా తయారైందని, దానిపై గవర్నర్ దృష్టి సారించాలని గవర్నర్ కు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. కొందరు పోలీసుల అధికారులకు అక్రమంగా సీనియారిటీ కల్పించి, ఐపీఎస్ లుగా పదోన్నతులు కల్పించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నారు.
2016లో కిషోర్ కుమార్ నేతృత్వంలో ఏర్పడ్డ ఒక కమిటీ, పకడ్బందీగా సీనియారిటీ రిపోర్టును తయారు చేసిందన్నారు. అభ్యంతరాలు, అనుమానాలుంటే వ్యక్తం చేయాలంటూ దాన్ని సర్క్యులేట్ చేస్తే… డీజీపీ ఠాకూర్ ఆ జాబితాను పూర్తిగా మార్చేశారని విజయసాయి అంటున్నారు! అది కూడా… రాజకీయ ఒత్తిళ్లకు లోబడే డీజీపీ ఈ పనిచేశారని ఆరోపించారు. డీఎస్పీల సీనియారిటీలను వారికి ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుని, తమకు కావాల్సిన వారికి పదోన్నతులు వచ్చేలా జాబితా మార్పులు చేసి కేంద్రానికి పంపించే ప్రయత్నం జరిగిందంటూ కొన్ని ఉదాహరణలు కూడా ఆ లేఖలో విజయసాయి పేర్కొన్నారు.
ఇంతవరకూ ఓకే. దీనిపై గవర్నర్ స్పందించాలని ఆయన కోరితే సరిపోయేది! కానీ, గవర్నర్ ఎలా స్పందించాలో కూడా ఆయనే చెప్పేశారు. ఒక సాధికార కమిటీని గవర్నర్ నియమించాలనీ, పదోన్నతుల జాబితా మొత్తాన్ని ఆ కమిటీతో పరిశీలించాలని సూచించారు. సీనియారిటీ జాబితాను న్యాయబద్ధంగా తయారు చేశాక, ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్పష్టం చేసుకున్నాక కేంద్రానికి పంపించాలన్నారు. సో… గవర్నర్ ఏం చెయ్యాలో ఆయనే మార్గనిర్దేశం చేశారు. అదేంటో… ఈసీకి ఫిర్యాదు చేసినా, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా… దానిపై వారెలా స్పందించాలో, ఎలా చర్యలు తీసుకోవాలో కూడా ఆయనే చెప్పేస్తుంటారు. తాజాగా గవర్నర్ కు పంపిన లేఖలోని కంటెంట్ తప్పు అని విమర్శించడం లేదు. అవకతవకలు జరిగాయని గవర్నర్ భావిస్తే చర్యలకు దిగాల్సిందే. కాకపోతే, ఎవరు ఎలా స్పందించాలనేది కూడా విజయసాయి రెడ్డి చెప్పేస్తున్న తీరునే ఇక్కడ ప్రస్థావించింది! ఫిర్యాదుల వరకూ ఓకే, కానీ తీసుకునే చర్యలపై మాట్లాడాలంటే ఏదో ఒక హోదా ఉండాలి కదా..!