అవుడ్డోర్ షూటింగ్ అంటే టాప్ స్టార్లు కాస్త జంకుతుంటారు. ఫ్యాన్స్ వచ్చిమీద పడిపోతుంటారన్నది వాళ్ల భయం. రజనీకాంత్లాంటివాళ్లు అవుడ్డోర్ షూటింట్కి ససేమీరా అంటారు. కానీ.. `దర్బార్` కోసం తప్పని పరిస్థితుల్లో అవుడ్డోర్ షూటింగ్‌కి రావల్సివచ్చింది. వచ్చి ఎంత పొరపాటు చేశారో చిత్రబృందానికి ఇప్పుడు అర్థమైంది.
రజనీ `దర్బార్` షూటింగ్ ముంబైలోని ఓ కాలేజీలో జరుగుతోంది. రజనీ షూటింగ్ జరుగుతోందంటే.. చుట్టుపక్కల ఉన్న అభిమానులంతా లొకేషన్ దగ్గర హడావుడి చేయడం మామూలే. అయితే ఆ కాలేజీ పేరు రహస్యంగా ఉంచాలనుకుంది చిత్రబృందం. కానీ వివరాలు మీడియాలో లీకవ్వడం వల్ల… కాలేజీ ఆవరణలో జన సందోహం ఎక్కువైపోయింది. వాళ్లని వీలైనంత వరకూ చిత్రబృందం కంట్రోల్ చేయగలిగింది. కానీ.. కాలేజీ విద్యార్థుల వల్ల రజనీ కి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. రజనీని చూడాలన్న అత్యుత్సాహంతో కాలేజీ విద్యార్థులంతా ఒక్కసారిగా సెట్లోకి ఎగబడ్డారు. దాంతో రజనీ వ్యక్తిగత సెక్యురీటీ రంగంలోకి దిగాల్సివచ్చింది. అభిమానులకూ – సెక్యురిటీ సిబ్బందికీ మధ్య వాగ్యూవాదం నడిచింది. చివరికి సహనం కోల్పోయిన అభిమానులు సెట్లో రాళ్ల వర్షం కురిపించారు. దాంతో చిత్రబృందం అప్పటికప్పుడు షూటింగ్‌కి పేకప్ చెప్పాల్సి వచ్చింది. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యంపైనా, విద్యార్థులపైనా దర్శక నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరో లొకేషన్ చూసుకునేంత వరకూ షూటింగ్‌కి సెలవలు ఇచ్చేసినట్టే.