గెలుపు తమదే అనే ధీమా ఎన్నికలైన మరుక్షణం నుంచి వైకాపా నేతల్లో దండిగా కనిపిస్తూ వచ్చింది. అలాంటప్పుడు, వారి పాయింటాఫ్ వ్యూలో తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చేస్తున్నా… అది మూణ్ణాళ్ల ముచ్చటే కదా. వైకాపా నేతల అంచనాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది వారే. ఆ ధీమా వంద శాతం ఉన్నప్పుడు ఈ ఇరవై రోజులపాటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేస్తే వారేకేం..? కానీ, ఈలోగా కూడా ఇంకా ఫిర్యాదులు, విమర్శలు ఆపడం లేదు వైకాపా నేతలు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… నలభైయేళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు, రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. అండర్ వరల్డ్ నుంచి తనకు సహాకారం అందుతోందనీ, మాఫియా తన వెనక ఉందనే అర్థం వచ్చినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు.
ఈ తరహా అర్థం వచ్చేలా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని శ్రీకాంత్ రెడ్డి కోరారు. కేసు నమోదు చేస్తేనే ప్రజలకు చట్టంపై నమ్మకం ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో సట్టా మార్కెట్ గురించీ, మట్కా గురించీ చంద్రబాబు ఎలా మాట్లాడతారని నిలదీశారు. ఇలాంటి వ్యక్తి నాయకుడిగా ఉండే తమ భవిష్యత్తు ఏంటనే ఆందోళన ప్రజలకు కలుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైందనీ, చంద్రబాబును భరించే స్థితిలో లేమని ఆ పార్టీ నాయకులే అనుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు విధానాలతో విసిగినవారంతా ఒక గ్రూపుగా ఏర్పడుతున్నారని, ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
సరే, ఈయన చెబుతున్నట్టే టీడీపీలో ముసలం వచ్చిందే అనుకుందాం. అది ఎవరికి ప్లస్ అవుతుంది… వారికే కదా! ఇలాంటి నాయకుడి సారథ్యంలో రాష్ట్రం ఉంటే భవిష్యత్తు ఏంటని శ్రీకాంత్ రెడ్డి ఎందుకు ఆందోళన చెందాలి? వైకాపాకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయి, ప్రభుత్వం తామే ఏర్పాటు చేయబోతున్నామనే ధీమాతో ఉన్నారు కదా! అలాంటప్పుడు రాష్ట్ర భవిష్యత్తు టీడీపీ చేతిలోనే ఉంటే ఎలా అనే ఈ ఆందోళన ఎందుకు..? పరిస్థితులన్నీ వారికి అత్యంత సానుకూలంగా కనిపిస్తున్నప్పుడు…. ఈ టెన్షన్ ఎందుకు?