ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దూషించినందుకు వైకాపా ఎమ్మెల్యే రోజాని శాసనసభ నుండి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని క్రిమినల్ నెంబర్:1 అని, స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు హంతకుడని అనుచిత వ్యాఖ్యలు చేసినందున అతనిని కూడా సభ నుండి సస్పెండ్ చేసేందుకు తెదేపా ఆలోచిస్తున్నట్లు సంకేతం వెలువడింది.
శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధంకావన్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ కోసం తెదేపా కసరత్తు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. కడప జిల్లాకే చెందిన తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డి ముఖ్యమంత్రికి ఒక లేఖ వ్రాసారు. దానిలో ముఖ్యమంత్రి పట్ల, స్పీకర్ పట్ల చాళా అనుచితంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని శాసనసభ నుంచి మిగిలిన మూడున్నరేళ్ళ కాలానికి సస్పెండ్ చేయాలని కోరారు. ఆయన చెపుతున్న కారణాలతో, చేస్తున్న డిమాండ్ తో తెదేపా నేతలు అందరూ ఏకీభవిస్తారు కనుక ఈసారి బడ్జెట్ సమావేశాలు మొదలయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అదుపుతప్పి మాట్లాడినా ఆయనని సభ నుండి సస్పెండ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే వైకాపా సభ్యులు అందరూ కూడా శాసనసభను బహిష్కరించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే శాసనసభ చరిత్రలో ఇదొక అవాంచనీయ పరిణామంగా మిగిలిపోతుంది.