రిలీజ్ డేట్ చెప్పి మరీ సినిమాలు విడుదల చేయడంలో పూరి జగన్నాథ్ దిట్ట. హీరో దొరకాలే గానీ.. మూడు నెలలకు ఓ సినిమా విడుదల చేయగల సమర్థుడు. స్టార్ హీరోతో కేవలం 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడంటే… పూరి ట్రాక్ రికార్డు అర్థం చేసుకోవొచ్చు. ప్రస్తుతం తను రామ్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ గా చూపిస్తున్నాడు. క్లాప్ కొట్టిన రోజే ‘ఈ సినిమాని మేలో విడుదల చేస్తాం’ అని ప్రకటించాడు కూడా. పూరి స్పీడు గురించి తెలుసు కాబట్టి.. మేలో ఈ సినిమా వచ్చేస్తుందనుకున్నారంతా.
కానీ… పూరి కూడా స్లో అయిపోయినట్టు అనిపిస్తోంది. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. కనీసం ఇప్పటి వరకూ టీజర్ కూడా రాలేదు. ఇప్పుడున్న మూడ్‌ని చూస్తే మేలో ఈ సినిమా రాదు. జూన్‌లో వస్తుందేమో చూడాలి. పూరి ఓ డేట్ చెప్పి, సినిమాని విడుదల చేయకపోవడం, కనీసం ఆ దిశగా ఆలోచించకపోవడం బహుశా ఇదే తొలిసారేమో. కాకపోతే.. చిత్రబృందం మరోలా ఆలోచిస్తోంది. మేలో పెద్ద సినిమాల హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా మహర్షి విడుదల అవుతోంది. ఆ సినిమా హిట్టయితే రెండు మూడు వారాల వరకూ కొత్త సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు భయపడుతుంటారు. అందుకే… మహర్షి హడావుడి అయిపోయాక సినిమాని తీసుకొద్దామని పూరి కూడా నిదానంగానే షూటింగ్ చేసుకుంటున్నాడు. పైగా పూరికి ఈ సినిమా చాలా ముఖ్యం. తనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు కాబట్టి… డబుల్ కేర్ తీసుకోకతప్పడం లేదు. హడావుడిగా సినిమాని విడుదల చేయడం కంటే మంచి టైమ్ చూసుకుని వదలడం బెటర్ అనుకుంటున్నాడు. మొత్తానికి పూరి కూడా ‘ఇస్మార్ట్’గా ఆలోచించడం మొదలెట్టాడన్నమాట.