మే 4… దాసరి జన్మదినం. ఆయన బతుకున్నప్పుడు ఓ పండగ. ఉదయం నుంచే… దాసరి ఇల్లు సెలబ్రెటీల రాకపోకలతో కళకళలాడిపోయేది. పేపర్లలో ఫుల్ సైజు యాడ్లు. టీవీలలో ప్రకటనలు. ట్విట్టర్లు హోరెత్తిపోయేవి. అయితే ఇప్పుడు అదంతా గతం. దాసరి మరణంతో.. ఆయన్ని, ఆయన పుట్టిన రోజునీ మర్చిపోయారు. చిత్రసీమ మాట అటుంచండి. `నేను దాసరి శిష్యుడ్ని` అని గర్వంగా చెప్పుకున్నవాళ్లు సైతం, `దాసరి నా తండ్రి లాంటివారు` అని డబ్బాలు కొట్టుకున్నవాళ్లు సైతం… ఇప్పుడు మాయమైపోయారు. ఈరోజు దాసరి పుట్టిన రోజు అన్న సంగతే మర్చిపోయారు.
దాసరి పుట్టిన రోజుని `డైరెక్టర్స్ డే`గా జరుపుకుంటూ వస్తోంది చిత్రసీమ. దర్శకులకు ఆయన తెచ్చిన గౌరవం అలాంటిది. అయితే.. ఇప్పుడు ఆ దర్శకులు సైతం.. దాసరి పుట్టిన రోజుని మర్చిపోయేరేమో అనిపిస్తోంది. దాసరి బతికున్నప్పుడు.. ఏ సమస్యొచ్చినా ఆయన దగ్గరకు చేరిపోయేవారంతా. సమస్య చిన్నదా? పెద్దదా? అని చూడకుండా, నా దగ్గరకు వచ్చిన వాడు స్టారా? సెలబ్రెటీనా? సామాన్యుడా? అని లెక్కలు వేసుకోకుండా, పరిష్కారం చూపించి పంపించిన పెద్దమనిషాయన. అలాంటి పెద్దమనిషిని చిత్రసీమ కూడా మర్చిపోయింది. గౌరవం అనేది మనిషి ఉన్నప్పుడేనా? ఆయన లేకపోతే ఇంతేనా? చిత్రసీమతో పాటు దాసరి కుటుంబ సభ్యులు కూడా దాసరి జయంతిని పక్కన పెట్టేయడం దారుణం. దాసరి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఆస్తి పంపకాల వ్యవహారాలు ఇంకా తేలలేదని, ఇద్దరు కొడుకులూ.. వాటాల కోసం పేచీలాడుకుంటూనే ఉన్నారని, ఆ గొడవలో జయంతి వేడుకల్ని వాళ్లు పరిగణలోనికి తీసుకొనేలేదని అంటున్నారు.
దాసరి తరవాత దాసరి లాంటివాడు పుట్టడు. ఆ స్థాయి మరెవ్వరికీ రాదు. ఆయన చేసిన మేలుని, చూపించిన మార్గాన్ని మర్చిపోవడం నిజంగా బాధించే విషయమే. ఎఫ్.ఎన్.సీ.సీలో కొంతమంది దర్శకులు, రచయితలు కలసి దాసరి పేరుతో కొన్ని సాంస్క్రృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇదీ కంటి తుడుపు వ్యవహారమే. దాసరి పేరుతో ఓ అవార్డు స్థాపించి, ప్రతీ యేటా ఉత్తమ దర్శకుడికి ఆ అవార్డు ఇవ్వగలిగితే, దాసరి పేరుతో కొన్నయినా సేవా కార్యక్రమాలు నిర్వహించగలిగితే… ఆయన ఆత్మ కాస్తయినా శాంతిస్తుందేమో.