దాసరి జయంతిని `డైరెక్టర్స్ డే`గా నిర్వహించింది తెలుగు చిత్రసీమ. దర్శకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని సాంస్క్రృతిక కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. దర్శకుల సంఘం కోసం ఓ నిధి ఏర్పాటు చేసి, విరాళాలు సేకరించారు. అంతా బాగానే ఉంది. కానీ దర్శకులంతా కలసి వేసిన స్కిట్లు మాత్రం `బీ` గ్రేడ్ లా అనిపించాయి. దర్శకులంతా నటులుగా అవతారం ఎత్తి, స్టేజీపై నవ్వించడానికి ప్రయత్నించారు. అయితే అవేమీ ఫలించలేదు. రేలంగి నరసింహారావు లాంటి సీనియర్లు స్టేజీపై హుషారుగా నటించడం వరకూ బాగానే ఉంది. కానీ వాళ్లు సెలెక్ట్ చేసుకున్నవన్నీ పాతకాలం స్కిట్లే. ఇటీవల వరుస విజయాలతో ఊపు మీదున్న అనిల్ రావిపూడి కూడా రెండు స్కిట్లు వేశాడు. తానే రాసి, మరో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి స్టేజీపై ప్రదర్శించారు. అవి కూడా అంతగా ఆకట్టుకోలేదు. బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలసి వేసిన స్కిట్ అయితే మరీ దారుణం. కితకితలు పెట్టుకున్నా నవ్వురాని పరిస్థితి. చిరంజీవి, రాఘవేంద్రరావుల్లాంటి అతిథుల్ని పిలిచి, వాళ్ల ముందు ఇలాంటి కుప్పిగంతులు ఏమిటా అనిపించింది. ఈతరం దర్శకులు, వెండి తెరపై నవ్వుల్ని పండించడంలో సిద్ధహస్తులైనవాళ్లు స్టేజీపై మాత్రం ఆ మాయ చేయలేకపోయారు. జబర్దస్త్ స్కిట్లే మరోమారు వేసినా బాగుండేదేమో అనిపించింది. బహుశా సినిమా కోసం రాయడంలోనూ, స్టేజీ నాటకానికి రాయడంలోనూ తేడా ఈ పాటికి నవతరం దర్శకులకు తెలిసి ఉంటుంది.
అగ్ర దర్శకులేరీ?
డైరెక్టర్స్ డేలో అగ్ర దర్శకులెవరూ కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి, పూరి.. ఇలా ఫేమ్‌లో ఉన్నవాళ్లెవరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోలేదు. సినిమాలు లేనివాళ్లు, దర్శకుల సంఘంలో కీలక బాధ్యతలు వహిస్తున్నవాళ్లు మాత్రమే ఈ కార్యక్రమంలో కనిపించారు. మరి పెద్ద దర్శకులెవరికీ దర్శకుల సంఘంతోనూ, డైరెక్టర్స్ డేతోనూ అస్సలు సంబంధం లేదా? వాళ్లకు ఇలాంటి వేడుకలు ఆనవా?
దర్శకుల సంఘం కోసం ఓ నిధిని ఏర్పాటు చేయాలని రాఘవేంద్రరావు పిలుపు ఇవ్వడం.. అప్పటి కప్పుడు కోటి రూపాయలు జమ అవ్వడం సంతోషించదగిన పరిణామాలు. కనీసం నిధి కోసమైనా.. అగ్ర దర్శకులు చేతులు కలపాలి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు చితికిపోయిన దర్శకులకు ఆసరాగా నిలబడాలి.