అల్లు అర్జున్ సినిమాల విషయంలో వేగం పెంచాడు. ఇప్పుడు తన చేతిలో మూడు సినిమాలున్నాయి. కాకపోతే.. ఎంచుకున్న దర్శకులే బన్నీని కాస్త డైలామాలో పడేస్తున్నారు. ఏ సినిమా ముందు చేయాలన్న ప్రశ్న ఇప్పుడు బన్నీ ముందు పెను సవాలుగా మారుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కించేసిన బన్నీ.. ఆ పనుల్లో బిజీగా ఉంటూనే, రెండు స్క్రిప్టులపైనా దృష్టి పెట్టాడు. సుకుమార్ సినిమాని ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభిస్తారు. కానీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే… సుకుమార్ సినిమా కోసం బన్నీ గెటప్ మార్చాల్సిన అవసరం ఉంది. ఆ సినిమా కోసం గెడ్డం పెంచాలి. బాడీ మార్చాలి. త్రివిక్రమ్ సినిమా చేస్తూ.. సుకుమార్ సినిమాని పూర్తి చేయడం కష్టం.
సుకుమార్ కూడా ఇప్పటికిప్పుడు బన్నీతో సినిమా చేయడానికి రెడీగా లేడు. సెకండాఫ్ విషయంలో సుక్కు ఇంకా తర్జన భర్జనలు పడుతూనే ఉన్నాడు. అయితే వేణు శ్రీరామ్ మాత్రం సుకుమార్ కంటే స్పీడుగా ఉన్నాడు. తన `ఐకాన్` స్క్రిప్టు దాదాపు రెడీ అయిపోయింది. మొదటి సీన్ నుంచి చివరి వరకూ నేరేషన్ కూడా ఇచ్చేశాడు. చిన్న చిన్న కరక్షన్లు తప్ప… చేయాల్సిందేం లేదు. త్రివిక్రమ్ సినిమా చేస్తూ… ఐకాన్ పూర్తి చేసే ఛాన్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే… సుకుమార్ కంటే ముందు ఐకాన్ సినిమా పట్టాలెక్కుతుంది. అయితే.. అంతకంటే ముందు తన స్క్రిప్టుని పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. `ఐకాన్` ఫైనల్ నేరేషన్ ఇచ్చేలోగా.. పూర్తి స్థాయి స్క్రిప్టు ఇచ్చేస్తానని అంటున్నాడట. ఇప్పుడు పరుగు పందెం.. సుకుమార్, వేణు శ్రీరామ్‌ల మధ్యే. మరి ఈ రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి.