హైదరాబాద్: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ మీడియాకు క్షమాపణ చెప్పారు. ఆదివారం నాటి ఘటనలో పోలీసులతోపాటు తమపై దాడులు చేయటమేమిటంటూ ఇవాళ స్థానిక జర్నలిస్టులు తునిలో ముద్రగడను నిలదీశారు. ఈ సందర్భంగా ముద్రగడ అనుచరులు కొందరు మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. అయితే ముద్రగడ మాత్రం ఆ రోజు పరిణామాలకుగానూ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు.
మరోవైపు తుని హింసాకాండతో తనకు సంబంధం లేదని ముద్రగడ అన్నారు. ప్రభుత్వమే ఈ దాడులు చేయించిందని, దీనికి తనవద్ద పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. తన లైసెన్స్డ్ రివాల్వర్‌ను ముద్రగడ ఇవాళ సరెండర్ చేశారు. అటు తుని ఘటనకు సంబంధించి పోలీసులు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో 57 కేసులు, తుని టౌన్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నింటిలో ముద్రగడ ప్రధాన నిందితుడిగా ఏ 1గా ఉన్నారు. ఈ కేసుల్లో కాపు నాయకులు వట్టి వసంతకుమార్, పళ్ళంరాజు, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, సి.రామచంద్రయ్య, సభాస్థలి యజమాని రాజా చినబాబు, 1 న్యూస్ ఛానల్ యజమాని సుధాకర్ నాయుడు తదితరులను కూడా నిందితులుగా చేర్చారు.