కేబినెట్ భేటీపై ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఈ నెల 10వ తేదీన కాకుండా 14వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్ పంపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారని నోట్లో వివరించారు. కానీ కేబినెట్ భేటీ జరగకుండా.. ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఎందుకలా..?
కేబినెట్ భేటీని అడ్డుకోవాలని సీఎస్ ఎందుకనుకుంటున్నారు..?
కేబినెట్ భేటీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదనే నమ్మకంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం… ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారని సీఎస్ మీడియాకు చెప్పారు. అయితే… అసాధారణ పరిస్థితులు.. ఏమున్నాయని.. ఈసీ మోడీకి పర్మిషన్ ఇచ్చిందో మాత్రం చెప్పలేకపోయారు. కేబినెట్ భేటీ అజెండా కోసం.. ఎల్వీ పట్టుబడుతున్నారు. ఎందుకంటే కేబినెట్ సమావేశంలో అధికారులు గీతదాటిన విషయంపై చర్చిస్తామని చంద్రబాబు చెప్పారు. కేబినెట్ సమావేశంలో తన సమక్షంలోనే అధికారులపై చర్చించటం ఇబ్బందికరంగా మారుతుందని ఎల్వీ భావించారని అంటున్నారు. అందువల్లే కేబినెట్ సమావేశం అజెండాపై సీఎస్, సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ కార్యదర్శిని సంప్రదించి ఆ మేరకు నోట్ పంపాలని సూచించారు. కార్యాలయం అధికారులు కూడా నోట్ ను మార్చి, ఎజెండాను కూడా చేర్చి నోట్ ను పంపారు.
సీఎస్‌ను మార్చాలని తీర్మానం చేస్తారని భయమా..?
సీఎస్‌ను మార్చాలని ఏకగ్రీవంగా కేబినెట్ తీర్మానం చేసి…ఈసీ పంపుతుందనే ప్రచారం సెక్రటేరియట్లో జరుగుతోంది. ఈ కారణంగానే ఎజెండాపై ఎల్వీ పట్టుబట్టినట్టు చెబుతున్నారు అయితే చంద్రబాబు ఆలోచన మాత్రం వేరుగా ఉందంటున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని… నిర్వీర్యం చేసి… ఈసీ ద్వారా ఏపీలో కేంద్ర పాలన నడిపిస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు… ఎన్నికల కోడ్ పరిమితులేమిటో చూపించాలనుకుంటున్నారు. ప్రజాప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటో నిరూపించాలనుకుంటున్నారు. ఈసీ నియమించిన.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల విధులు కాకుండా… ప్రభుత్వమే తానన్నట్లుగా.. సీఎంకు అధికారాలే లేవన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో … ఈ విషయంలో మరింత పట్టుదలకు వెళ్తున్నారు.
ఎన్నో తప్పులు చేసి డాక్యుమెంట్ల సాక్ష్యంగా సీఎస్ దొరికిపోయారా..?
ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా సీఎస్ నియామకం జరిగింది. ఈసీ పోలింగ్ కు రెండు రోజుల ముందు పునేఠాను తొలగించి ఎల్వీని సీఎస్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన తానే… ప్రభుత్వం అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రోజూ బిజినెస్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంత వరకూ ఆయన సీఎంకు రిపోర్ట్ చేయలేదు…పైగా సీఎంకు అధికారాలు లేవని మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. దానిపై సీఎం వివరణ తీసుకున్నారు. అలాగే సీఎంకు చెప్పకుండా.. టీటీడీ బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరలిస్తూ ఈసీకి పట్టుబడిన వ్యవహారంపై విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికను మళ్లీ సీఎం వద్దకు పంపారు. వాటితో పాటు.. నెల్లూరులోని సింహపురి ఆస్పత్రి వ్యవహారంలో.. సీఎస్ జోక్యం మరింత వివాదాస్పదం అయింది. అవయవ వ్యాపారం చేస్తూ దొరికిపోయిన ఆస్పత్రిని ఆయన తన చేతికి మట్టి అంటకుండా… ఇతర అధికారులను సీఎస్ హోదాలో ఆదేశిస్తూ.. కాపాడే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇవి మాత్రమే కాదు.. సమీక్షల పేరుతో.. కేబినెట్ నిర్ణయాలపై విమర్శలు చేయడం లాంటివి కూడా ఆయన చేశారు. ఏ విధంగా చూసినా..సీఎం.. బిజినెస్ రూల్స్ ను పూర్తి స్థాయిలో అతిక్రమించారని.. ఏ మాత్రం అవగాహన ఉన్న వారైనా చెబుతున్నారు. అందుకే.. కేబినెట్లో బిజినెస్ రూల్స్ అతిక్రమణపై చర్చ ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారు.