అమరావతిలో నిన్న వర్షం కురిసిందనీ, దీంతో రాజధాని నిర్మాణంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి బట్టబయలైందని ఆరోపించారు వైకాపా నేత అంబటి రాంబాబు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చిన్న గాలీవానా వస్తే అమరావతిలో బీభత్సం జరిగిపోయిందన్నారు. జస్టిస్ సిటీ భవనం అద్దాలు తునాతునకలైపోయాయనీ, స్మార్ట్ టవర్ పడిపోయిందనీ, చిన్న గాలీవానకే ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి కాదని అంబటి అన్నారు. అమరావతిలో భారీ వర్షం పడితే మంత్రుల ఛాంబర్లు నీళ్లతో నిండిపోతాయన్నారు. వర్షం పడితే సెక్రటేరియట్ లోకి నీళ్లొస్తాయనీ, గాలేస్తే కట్టడాలు ఎగిపోతున్నాయనీ, ఈ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రపంచస్థాయి రాజధాని కడతానని ప్రజలకు చెప్పి, చిన్నవానకే ఊగిపోయే నగరమా నిర్మించింది అని నిలదీశారు. గాలి వాన కారణంగా అమరావతిలోఎందుకిలా జరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందన్నారు.
ఈవీఎంల గురించి మాట్లాడుతూ… 2000 సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చాయనీ, అప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికల వ్యవస్థ రోజురోజుకీ పటిష్టమౌతోందనీ, ఈ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలన్న ఉద్దేశమే తప్ప, చంద్రబాబు ఆలోచన మరొకటి కాదని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి కారణం తన పాలన కాదనీ, ఈవీఎంల పనితీరే అని చెప్పడానికి అనువుగా ఇప్పట్నుంచే నేపథ్యాన్ని రెడీ చేసుకుంటున్నారని అంబటి అన్నారు. మంత్రి వర్గ సమావేశం గురించి మాట్లాడుతూ… తాను మీటింగ్ పెడితే సీఎస్ వస్తారా లేదా అనే పంతంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటే, పెట్టుకోవచ్చని రూల్స్ చెబుతున్నాయన్నారు. అయితే, ఇది అవసరం కోసం పెడుతున్న కేబినెట్ కాదనీ, సవాల్ కోసం మాత్రమే మీటింగ్ అన్నారు.
రాష్ట్రంలో కేబినెట్ భేటీ పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి లేదని అంబటి చెబుతున్నట్టే కదా! ఫొని తుఫాను, రాష్ట్రంలో ఎండల తీవ్రత, తాగు సాగునీటి అవసరాలు, వేసవిలో ఉపాధి హామీ పనులు, కరువు పరిస్థితులు… ఇవన్నీ ఇప్పుడు అవసరం లేని అంశాలని అంబటి చెబుతున్నట్టే! ఈవీఎం 2000లోనే వచ్చాయి కరెక్టే… కానీ, వాటిని ట్యాంపర్ చెయ్యొచ్చు అనే అనుమానాలు ఇప్పుడొచ్చాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందా లేదా? చాలా దేశాల్లో ఈవీఎంల నుంచి బేలెట్ విధానానికి ఎన్నికలు మారాయి. ఈవీఎంలతోనే ఎన్నికల వ్యవస్థ పటిష్టమైపోతే… అలా ఎందుకు మారినట్టు? ఇంకోటి.. అమరావతిలో నిర్మించిన స్మార్ట్ టవర్ కు రూ. 25 లక్షలు ఖర్చు కాదనీ, దాన్లో ఓ పదో పదిహేనో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. దానికి ఆధారాలేంటో చెప్పరు!