బీజేపీ లేదా బీజేపీ కూటమి… అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అంటే.. మరో మాట అవసరం లేకుండా… నరేంద్రమోడీ పేరు ప్రచారంలోకి వస్తుంది. కానీ ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి అనే ప్రస్తావన మాత్రం… “నో మోడీ” అనేదే ప్రధానమైన షరుతుగా మారే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఏ మిత్రపక్షం .. బీజేపీ పక్కన చేరాలన్నా… “ప్రధానిగా మోడీ తప్ప..” అనే మాట వినబడటం ఖాయం.
మిత్రపక్షాలనూ కలిపేసుకునే ప్రయత్నం చేసిన మోడీ, షా..!
మిత్రపక్షాలంటే… మోడీ , షాలకు పడదు. మోడీ , షాలు అంటే మిత్రపక్షాలకు పడదు. నరేంద్రమోడీ, అమిత్ షా… ఏ తరహా రాజకీయాలు చేస్తారో… గత నాలుగేళ్లుగా.. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు చూశాయి. మిత్రపక్షాలు, విపక్షాలు అన్న తేడాను.. మొదటి మూడేళ్లు చూపించలేదు. వీలైనంతగా.. తమ పార్టీని విస్తరింప చేసుకోవడానికి మిత్రపక్షాలను కూడా..మింగేయడానికి ప్రయత్నించారు. వారి విధానాల దెబ్బకు.. శివసేన కూడా.. చివరికి.. గుడ్ బై చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ ఎన్నికలకు ముందు తమ మార్క్ రాజకీయాలను పక్కన పెట్టి… గుడ్ బై చెబుతాయనుకున్న శివసేన, అకాలీదళ్, జేడీ యూ పార్టీలను మాత్రం కూటమిలో ఉంచుకోగలిగారు. ఆ మూడు పార్టీలకూ… తమను బీజేపీ మింగేయబోయిందన్న విషయం తెలుసు. అయినప్పటికీ.. రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకున్నారు. కానీ అవకాశం వస్తే ఆ పార్టీలు.. బీజేపీని.. ముఖ్యంగా మోడీని ముంచేయడానికి సిద్ధమే.
ప్రాంతీయ పార్టీలేవీ మోడీ, షాలను నమ్మే పరిస్థితి లేదు..!
మిత్రపక్షాలతో మోడీ, షా వ్యవహరించే తీరు క్లిష్టపరిస్థితుల్లోనూ మారదు. కొద్ది రోజుల క్రితం గోవా సీఎంను మార్చాల్సి వచ్చింది. వెంటనే.. ముగ్గురు ఎమ్మెల్యేలతో మిత్రపక్షంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీ అడ్రస్‌ను గల్లంతు చేశారు. దాంతో ఆ పార్టీ గగ్గోలు పెట్టింది. అవసరాన్ని బట్టి.. బీజేపీ ఆ తరహా రాజకీయాలు చేస్తుంది. అందుకే.. ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ ఇప్పుడు లేరు. మళ్లీ అధికారంలోకి మోడీ వస్తే.. తమను… రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకుని.. తమను టార్గెట్ చేసి.. తమ పార్టీలను నిర్వీర్యం చేస్తారనే భయం ప్రాంతీయ పార్టీల్లో ఉంది.
మోడీని పక్కన పెడితే… బీజేపీకి మరికొన్ని పార్టీల మద్దతు..?
అందుకే.. ఇప్పుడు…ఆరెస్సెస్ ప్రతినిధులుగా.. బీజేపీలో కీలక స్థానాల్లో ఉన్న రామ్‌మాధవ్, మురళీధర్ రావు లాంటి వాళ్లు పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారు. వారు.. తమ కూటమిలో లేని.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీలపై సానుకూల భావనతో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లందరూ… ముఖ్యంగా ఆరెస్సెస్ క్యాంప్… ఎన్నికల తర్వాత అవసరం అయితే.. మోడీని పక్కన పెట్టి.. గడ్కరీని ప్రధానిగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. గడ్కరీ ప్రధాన మంత్రి అయితే.. కొన్ని పార్టీలు బీజేపీతో కలవడానికి ముందుకు వస్తాయని అంటున్నారు. అదే మోడీ అంటే… మరిన్ని దూరమయ్యే పరిస్థితి ఉంది. అందుకే.. ఈ సారి మోడీకి మిత్రపక్షాలు దొరకవు కానీ… బీజేపీకి మాత్రం దొరికే చాన్స్ ఉందంటున్నారు.