దేశవ్యాప్తంగా మీడియా రంగంలో సంచలనం సృష్టించిన టీవీ9 మీడియా సంస్థలో పరిస్థితులు దిగజారిపోయారు. మెజార్టీ వాటాను కొన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. మైనర్ వాటా ఉన్న ఇతరుల మధ్య.. వివాదం.. చివరికి కేసుల వరకూ వెళ్లింది. నిజానికి ఈ వివాదం .. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద ఉన్నప్పటికీ.. కొత్తగా రవిప్రకాష్‌పై కేసులు పెట్టి… కీలక మలుపులు తిప్పేందుకు… కొత్తగా వాటాలు కొన్న యాజమాన్యం అధికారాన్ని ప్రయోగించింది.
రవిప్రకాష్‌పై ఫోర్జరీ కేసు పెట్టిన అలంద మీడియా..!
టీవీ 9చానళ్ల యాజమాన్యం నిన్నామొన్నటిదాకా.. ఏబీసీఎల్. దానికి శ్రీనిరాజు చైర్మన్. అయితే.. శ్రీనిరాజు.. తనకు ఉన్న ఎనభై శాతం వాటాలను… కొద్ది రోజుల కిందట… బడా కాంట్రాక్టర్లు, బిల్డర్లు అయిన మేఘా కృష్ణారెడ్డి, మైహోం జూపల్లి రామేశ్వరరావులకు అమ్మేశారు. అప్పట్నుంచే వివాదం ప్రారంభమయింది. దాదాపుగా రూ. 5వందల కోట్లు వెచ్చించిన ఈ డీల్ తర్వాత… బడా కాంట్రాక్టర్లు.. అలంద మీడియా అనే కంపెనీ తరుపున నలుగురు డైరక్టర్లను నియమించారు. కానీ.. ఆ నియామకం చట్ట విరుద్ధమని.. అసలు మిగిలిన ఇరవై శాతం వాటాదారులకు తెలియకుండానే.. అమ్మకం జరిగిందని ఆరోపిస్తూ… 20 శాతం వాటాదారులు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ఇప్పుడీ వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంది.
కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో విచారణ జరుగుతూండగానే ఎందుకు..?
అయితే ఈ మైనర్ వాటాదార్ల జాబితాలో.. రవిప్రకాష్ తో పాటు నటుడు శివాజీ… మరికొన్ని విదేశీ పెట్టుబడుల సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా.. కొత్త డైరక్టర్ల నియామానికి వ్యతిరేకంగా ఉన్నారు. తమ వివాదం పరిష్కారం అయ్యే వరకూ.. బోర్డులో ఎలాంటి మార్పులు చేయవద్దని కోరుతున్నారు. ఈ సమయంలో… హఠాత్తుగా.. రవిప్రకాష్‌పై… అలంద మీడియా సంస్థ ప్రతినిధి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని… డైరక్టర్ల నియామకానికి అడ్డుకుంటున్నారని… ఆయన ఫిర్యాదు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగిపోయి.. రవిప్రకాష్ తోపాటు.. శివాజీ ఇంటిలోనూ సోదాలు చేశారు. కేసు నమోదు చేశారు.
కేసులతో రవిప్రకాష్ అండ్ టీంను బెదిరించాలనుకుంటున్నారా..?
నిజానికి కౌశిక్ రావు సంతకాన్ని ఫోర్జరీ అనే ప్రశ్నే తలెత్తదని.. ఈ వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. టీవీ 9పై పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం… అలంద మీడియా.. ఇలా కేసులు పెట్టి బెదిరించడానికే ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో అసలు వివాదం ఉండగా.. కొత్తగా ఫోర్జరీ పేరుతో ఆరోపణలు చేయడమే… అసలు కుట్ర కోణం ఉందంటున్నారు. మొత్తానికి.. టీవీ9 వివాదం.. ఓ కొత్త మలుపు తిరిగింది. కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని పోలీసు కేసుల వరకూ తీసుకొచ్చారు. ఇది మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.