భాగ్యనగరంలో మజ్లిస్ పార్టీ అరాచకత్వం ప్రబలిపోకుండా ఇన్నాళ్లకు అన్ని పార్టీలూ ఒక్కతాటి మీదకు రావడానికి, నిర్దిష్టమైన కార్యాచరణతో మజ్లిస్ ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నానికి పూనుకోవడం ఇప్పుడు జరుగుతున్నది. మజ్లిస్ పార్టీకి చెందిన గూండాలు సాక్షాత్తూ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ ఆలీని దారుణంగా కొట్టడం, సాక్షాత్తూ మజ్లిస్ ఎమ్మెల్యే ఏకంగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఇంటిమీద దాడిచేసి ఆయన కొడుకును చితక్కొట్టడం, ఇంకా ఇతరత్రా జరిగిన అనేక దాడులు పాతబస్తీలో ప్రబులుతున్న అరాచకత్వానికి నిదర్శనాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే.. కేవలం గ్రేటర్ హైదరాబాద్కార్పొరేషన్ మేయర్ పీఠం మీదికి రావడానికి ప్రతిసారీ కొన్ని డివిజన్లను గెలుచుకుంటూ ఉండే ఎంఐఎం మీద ఆధారపడడం అనేది పెద్ద పార్టీలకు గత్యంతరం లేని స్థితిగా మారుతోంది. అందుకే పార్టీలన్నీ వారి ఆగడాల్ని చూసీ చూడనట్లుగా వెళుతుండడం సాధారణంగా జరుగుతోంది.
అయితే ఈసారి మజ్లిస్ ఆగడాలు శృతి మించాయనే చెప్పాలి. ఎందుకంటే.. మజ్లిస్ మా మిత్రపక్షమే.. అని తెరాస అధినేత చెబుతూ ఉన్నప్పటికీ.. అదే పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి కొడుకునే చితక్కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను చితక్కొట్టారు. ఇంత దారుణమైన ఆగడాలకు పాల్పడడంపై పీసీసీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నది.
కనీసం ఎంఐఎం ఎప్పుడో ఒకసారి తమకు ఉపయోగపడుతుంది అనే ఆశలను పక్కన పెట్టి.. ఇప్పుడు అన్ని పార్టీలూ ఎంఐఎం ఆగడాలకు బలవుతున్నాయి కాబట్టి.. అందరూ కలిసి ఐక్యంగా వారికి చెక్ పెట్టడానికి కార్యచరణ చర్చించుకోడానికి సమావేశం అవుతున్నారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి, అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి గులాబీ పార్టీ కూడా తోడ్పాటు అందిస్తుందా లేదా అనేది సందేహం. కాంగ్రెస్ పార్టీ అందరినీ పోగేస్తున్న ఈఅఖిల పక్షసమావేశానికి తెరాస దూరంగా ఉంటే మాత్రం నగరాన్ని మజ్లిస్ ఆగడాలనుంచి రక్షించే ఉద్దేశం వారికి లేనేలేదని, చెప్పినవన్నీ మెరమెచ్చు మాటలేనని అనుకోవాల్సి వస్తుంది.