తెలుగు మీడియాలో… దినపత్రికల్లో ఈనాడు ట్రెండ్ సెట్టర్ అయితే… ఎలక్ట్రానిక్ న్యూస్ చానళ్లతో టీవీ9ది ఆ స్థానం. దినపత్రికలు న్యూస్ ఇస్తాయి. ఆ న్యూస్‌ను.. టీవీ స్క్రీన్ మీద చదవడమే న్యూస్ చానల్ కాదని.. తన చేతలతో నిరూపించారు. ప్రేక్షకుల భావోద్వేగాలను బట్టి.. న్యూస్ కవరేజీ ఉంచుకునేలా చేసి… ప్రేక్షకుల నాడి పట్టారు. అనితర సాధ్యమైన విజయాలు సాధించారు. టీవీ9 సక్సెస్‌లో కర్త, కర్మ, క్రియ అన్నీ రవిప్రకాషే..!
రవిప్రకాష్ ముద్ర లేని చోట టీవీ9 ఎలా ఉంటుంది..?
ఎలక్ట్రానిక్ మీడియా రంగం చాలా భిన్నమైనది. అదే పనిగా బ్రాండ్ మీద నిలబడి ఉండటం అసాధ్యం. ఎప్పటికప్పుడు.. కొత్త కొత్త ఆలోచనలతో.. మారుతున్న ప్రేక్షుకుల అభిరుచిని బట్టి వార్తల శైలి కూడా మార్చుకుంటూ పోవాలి. ఆ విషయంలో రవిప్రకాష్‌ది అందే వేసిన చేయి. అందుకే టీవీ 9… ఆ తర్వాత ఓ ఇరవై చానళ్లకుపైగా వచ్చినప్పటికీ.. నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఇతర చానళ్లన్నీ టీవీ9ని కాపీకొట్టి.. అలాగే ఉండాలని తాపత్రయ పడ్డాయి కాబట్టే.. చాలా దూరంగా ఉండిపోయారు. రవిప్రకాష్ ను మించి వినూత్నంగా కొత్తగా ఆలోచించే వారు లేకపోవడంతోనే ఈ పరిస్థితి. రవిప్రకాష్‌తో పాటు టీవీ9 ఆరంభంలో పని చేసిన ఎంతో మంది ఉన్నత జర్నలిస్టులు మధ్యలో బయటకు వెళ్లారు. కొన్ని టీవీ చానళ్లు బాధ్యతలు తీసుకున్నారు. ఏ ఒక్కరూ సక్సెస్ కాలేదు. దాన్ని బట్టి చూస్తేనే.. రవిప్రకాష్ టీవీ9 సక్సెస్‌లో ఎంత కీలకమో అర్థం అయిపోతుంది. ఇప్పుడు అలాంటి రవిప్రకాష్ టీవీ9 వ్యవహారాల్లో వేలు పెట్టలేరు.
స్క్రీన్ ప్రజెన్స్ దెబ్బతింటే బ్రాండ్ వాల్యూ తగ్గిపోదా..?
ఓ కన్స్ట్రక్షన్ కంపెనీని టేకోవర్ చేయవచ్చు…! మరో చాక్లెట్ల పరిశ్రమను టేకోవర్ చేయవచ్చు..! ఇంకో తయారీ పరిశ్రమలో షేర్లు కొని.. బోర్డు మార్చొచ్చు. అదంతా ప్రజలకు సంబంధం లేకుండా జరిగే అంతర్గత వ్యవహారం. ఆ కంపెనీ బోర్డుల్లో ఎవరుంటారో సామాన్యులకు తెలియదు. అవసరం లేదు కూడా. ఎందుకంటే.. వారి ప్రొడక్టులకు.. యజమానులకు, ఉద్యోగులకు సంబంధం ఉండదు. కానీ టీవీ మీడియాలో అలా కాదు. టీవీ బ్రాండ్ …. అందులో కనిపించే వారి ఫేస్ వాల్యూ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు టీవీ నైన్ అంటే.. మొదట రవిప్రకాష్, ఆ తర్వాత రజనీకాంత్, మురళీకృష్ణ, దీప్తి వాజ్‌పేయి, జాఫర్, దేవి… ఇలా.. కొంత మంది తమ ముద్ర వేసుకుపోయారు. వారి శైలికి ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. మరి వీరందరూ రవిప్రకాష్ లేకుండా టీవీ9లో ఉంటారా..?. ఉంటామన్నా… కొత్త యాజమాన్యం నమ్మకంగా ఉంచగలుగుతుందా..? . ఒక వేళ ఉన్నా.. వీరికి… కొత్త యాజమాన్యంలో వచ్చే కొత్త కొత్త సూచనలు మనస్ఫూర్తిగా పాటించగలరా..?
పోటీ చానళ్లకు గొప్ప అవకాశం ..!
టీవీ9ను దాటాలని.. పదిహేనేళ్లుగా.. కొత్త చానళ్లతో… టీవీ9 ఫార్ములాతో ప్రయత్నిస్తున్న వారు.. చాలా మంది ఉన్నారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు వెళ్లిపోయారు. కొంత మంది రంగంలో ఉన్నారు. టీవీ9 పెట్టుబడికి వంద రెట్లు ఎక్కువ పెట్టి.. అంతకు మించి గ్రామ స్థాయి నెట్‌వర్క్‌తో వచ్చిన చానళ్లు.. కూడా నిలబడలేకపోయారు. రేటింగ్స్‌లో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఇప్పుడు అలాంటి వారందరికీ మరో చాన్స్ వచ్చింది. రవిప్రకాష్ లేని టీవీ 9ని అయినా… దాటేసే చాలెంజ్ ఎదుటకు వచ్చింది. టీవీ9కి ఇప్పుడు ఎన్నో పరిమితులు ఉన్నాయి. ఇద్దరు బడా కాంట్రాక్టర్లకు… ఎన్ని అవసరాలు ఉంటాయో.. అవన్నీ.. ఈ టీవీ చానళ్లు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ప్రేక్షుకల అభిరుచి కన్నా.. యాజమాన్య అవసరాలే ఆ చానల్‌కు ముఖ్యం కానున్నాయి. ఇలాంటి సమయంలో.. టీవీ 9 దాటేందుకు.. చానళ్లకు.. ఎన్నో అవకాశాలు ముందున్నాయి. ఏదైనా చానల్ అనుకున్నది సాధిస్తుందా..?