ఒక వ్యక్తి చేసే తప్పులని ఒక కులం మొత్తానికి లేదా మతం మొత్తానికి ఆపాదించడం ఎంత మాత్రం సమంజసం కాదు అన్నది ఒక ప్రాథమిక సూత్రం. అయితే ఈ విజ్ఞతను మర్చిపోయి విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీ9 సీఈఓ స్థానం నుండి రవి ప్రకాష్ ను తీసి వేసినట్లుగా మేనేజ్మెంట్ ప్రకటించిన తర్వాత విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ల పై, రవి ప్రకాష్ వైఖరితో విభేదించే నెటిజన్లు సైతం విరుచుకుపడుతున్నారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ “మెరుగైన సమాజం కోసం’ పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడు. కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడు. మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్ ఒకడు.” అని రాసుకొచ్చారు.
అయితే ఒక వ్యక్తి చేసిన తప్పులను ఆ కులం మొత్తానికి ఆపాదించడం ఎంత మాత్రం సమంజసం కాదు అంటూ, ” అక్రమాస్తుల కేసులో జగన్ అవినీతి వెళ్లాడని, ఆడిటర్ గా ఆ పాపంలో భాగం పంచుకొన్నందుకు విజయసాయి రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని’ ఆ తప్పులను రెడ్డి కులం మొత్తానికి ఆపాదించడం ఎంత మూర్ఖత్వమో, ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి రవి ప్రకాష్ తప్పులను ఒక కులం మొత్తానికి ఆపాదించడం కూడా అంతే తప్పని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇంకొంతమంది అయితే మరో అడుగు ముందుకు వేసి, ఇటీవల అమ్మాయిలపై అఘాయిత్యం చేసిన శ్రీనివాసరెడ్డి అనే ఒక సైకో చేసిన పాపాల ను ఆ కులం మొత్తానికి ఆపాదించవచ్చా అంటూ ప్రశ్నిస్తూ అలా చేయడం సబబు కాదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలని సరి చేసే ప్రయత్నం చేశారు.
గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ” ఉల్లిపాయ” అంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు, కాపు కులానికి సంబంధించిన చాలా మంది ఆ వ్యాఖ్య వెనక పాతకాలం నాటి ముతక సామెత ని ప్రస్తావించే ఒక దురుద్దేశం ఉందంటూ విజయసాయిరెడ్డి మీద మండిపడ్డారు. ఇప్పుడు ‘కమ్మని’ అంటూ పరోక్షంగా కులాన్ని ప్రస్తావించడాన్ని కూడా చాలామంది తప్పు పడుతున్నారు. మీ పార్టీలో కూడా ఆయా కులాల వాళ్ళు కూడా ఉన్నారని విజయసాయి రెడ్డి కి వారు గుర్తు చేస్తున్నారు.