జాతీయ రాజకీయాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై తాజాగా స్వరం మారిన పరిస్థితులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఫ్రెంట్ ఏర్పడుతుందనీ, దీనికి కేసీఆర్ మద్దతు ఇస్తారు అనే విధంగా వినోద్ కుమార్ కూడా మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే అవకాశాలపైనే ఆయన స్పందించారు. దీంతోపాటు, తెరాస, కాంగ్రెస్ నేతల భేటీ జరిగిందంటూ కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కేసీఆర్ మనోగతానికి భిన్నంగా ఇవన్నీ జరుగుతాయని అనుకోలేం కదా! ఈ నేపథ్యంలో కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాల గురించి తెరాసలో ఆసక్తికరమైన చర్చే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
గడచిన రెండ్రోజులుగా వినిపిస్తున్న ఈ కథనాలపై తెరాస నాయకుల్ని ప్రశ్నిస్తే… ఇవి ఊహాగానాలు అని కొట్టి పారేస్తూనే, కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఒక కొత్త విశ్లేషణను వారే తెర మీదికి తెస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కేసీఆర్ కేరళ వెళ్లొచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో భేటీ అయ్యారు. అనంతరం, తమిళనాడు, కర్ణాటక వెళ్దామనుకున్నారు.. ఆ తేదీల్లో కొంత మార్పు వచ్చింది. కానీ, ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనలు కొనసాగించే అవకాశం ఉందనేది తెరాస వర్గాల మాట. ఎందుకంటే, వివిధ పార్టీల అధినేతలతో భేటీ కావడం వల్ల… వారి మనసులో ఏముందనేది ముందుగా తెలుస్తుందని అంటున్నారు. అంటే, కాంగ్రెసేతరం భాజపాయేతరం అని ముందుగానే కేసీఆర్ మాట్లాడకుండా… జాతీయ రాజకీయాల్లో కలిసి ముందుకు సాగాలంటే ఏం చెయ్యాలనే అభిప్రాయాలను మాత్రమే వారి నుంచి రాబడుతున్నారట! కేంద్రంలో ఎలాంటి పాత్ర పోషించగలం అనే అంశం మీదే ఆయన అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అంటే, ఎన్నికల ఫలితాల తరువాత ఏదో ఒక జాతీయ పార్టీతోనే ముందుకు వెళ్లాలని మెజారిటీ పార్టీలు భావిస్తే… కేసీర్ నిర్ణయం కూడా దానికి అనుగుణంగా ఉండే అవకాశాలను ఓపెన్ గా ఉంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. లేదా, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీల ప్రమేయం వద్దని మెజారిటీ ప్రాంతీయ పార్టీలు భావిస్తే… అప్పుడు ఫెడరల్ ఫ్రెంట్ అంశాన్ని ముందుకు తీసుకుని, దానికి తానే లీడ్ చేసే అవకాశాన్ని కూడా కేసీఆర్ ప్లాన్ బి గా సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.