జై సింహా కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ – కె.ఎస్.రవికుమార్ – సికల్యాణ్ కలసి చేస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 17న లాంఛనంగా ప్రారంభిస్తారు. జూన్‌లో షూటింగ్ మొదలెడతారు. మూడు నెలలలో ఈసినిమాని పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే పనులన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి `రూలర్` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో సి.కల్యాణ్ ఈ పేరుని రిజిస్టర్ చేయించారు. అది బాలయ్యకు ఖాయమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో బాలయ్య ఓ లంచగొండి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని టాక్. టెంపర్‌లో ఎన్టీఆర్, టపాస్ లో కల్యాణ్ రామ్ ఇలానే లంచగొండి పోలీసులుగా కనిపించారు. ఇప్పుడు బాలయ్య కూడా అదే అవతారం ఎత్తబోతున్నాడు. అందుకే ఈ సినిమాకి `రూలర్` అనే టైటిల్ పక్కా అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.