తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు మరోసారి సీరియస్ అయ్యారు. గాంధీభవన్ లో పార్టీ నేతలతో సమావేశం ప్రారంభం కాగానే, నాయకులు తీరుపై చిరుబురులాడారు. ఎమ్మెల్యేలు అందరూ పార్టీ మారిపోయిన తరువాత తీరిగ్గా ఇప్పుడు సమావేశం పెట్టుకుని ఏం ఉపయోగం అని సొంత పార్టీ నాయకులని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరితో సమావేశం పెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఫిరాయింపుల్ని అడ్డుకునే పరిస్థితి ఉండేదన్నారు. జరగాల్సిందంతా జరిగిపోయాక విశ్లేషణలు పెట్టుకోవడం వల్ల పార్టీకి ఏరకంగానూ ఉపయోగం ఉండదన్నారు.
పార్టీలు మారిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని ప్రస్థావిస్తూ… ఆయన ఒక్కరే యాత్రలు చేయడమేంటని ప్రశ్నించారు. పార్టీలోని సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు సాగకుండా సొంతంగా వ్యవహరిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు అని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపు సమయంలోనూ ఇలానే జరిగిందనీ, పార్టీలో ఉన్నవారిని బయటకి పంపించేసి, కొత్తవారికి టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. సామాజిక వర్గ సమీకరణాలను కూడా పట్టించుకోకుండా టిక్కెట్లు ఇచ్చేశారన్నారు. ఆ తరువాత, సమావేశం నుంచి అర్ధంతరంగా వీహెచ్ వెళ్లిపోయారు.
ఇంతకీ, వీహచ్ ఇంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు? అంటే… నిజానికి ఆయన ఈ మధ్య సొంత పార్టీ నేతల తీరుపై తరచూ విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఈరోజు ఆ డోస్ కాస్త పెంచారంతే. అయితే, తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని మార్పులు తప్పవనే కథనాలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవుల్లో మార్పులు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగానే… టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం దగ్గర్నుంచీ, ఎమ్మెల్యేల ఫిరాయింపుల వరకూ అన్ని అంశాలనూ వీహెచ్ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే… పార్టీ అధిష్టానం మార్పు కోరుకుంటోందన్న వాతావరణం ఉండటంతో తన సొంత అజెండా ప్రకారం ఏమైనా మార్పులను వీహెచ్ ఆశిస్తున్నారా అనేదే ఇక్కడ చిన్న సందేహం! ఎందుకంటే, పార్టీలో ప్రాధాన్యత కోసం పాకులాడుతున్న నేతల్లో ఆయనా ఉన్నారు కదా! ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పులకు కావాల్సిన నేపథ్యాన్ని హైలైట్ చేసే ప్రయత్నం వీహెచ్ ద్వారా జరుగుతున్నట్టుగా భావించొచ్చు!