సినిమా నిడివి ఎక్కువైంది – మహర్షి గురించి అందరూ కామన్‌గా చెప్పే మాట ఇదే. నిడివి వల్లే… ఎమోషన్ క్యారీ కాలేకపోయిందని విమర్శకులు అంటుంటే, అసలు క్లైమాక్స్ లో ఎమోషన్ పండిందే దాని వల్ల.. అని దర్శక నిర్మాతలు అంటున్నారు.
మహర్షి దాదాపు 3 గంటల సినిమా. సాధారణంగా సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పుడు సినిమాకి ఎక్కడకక్కడ కత్తెర్లు వేయాలని భావిస్తుంటారు. మహర్షి సినిమాకి అది అవసరం కూడా. పైగా.. సినిమా సుదీర్ఘంగా సాగిందన్న విషయంలోనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నప్పుడు కచ్చితంగా కత్తెరకు పని కల్పిస్తారనుకుంటారు. కానీ… మహర్షి సినిమా నిడివి తగ్గించే ప్రసక్తి లేదని అటు దిల్‌రాజు, ఇటు వంశీ పైడిపల్లి ముక్త కంఠంతో చెబుతున్నారు.
మహర్షి లాగ్ అయ్యిందన్న విషయం దర్శక నిర్మాతల దృష్టికి ఎప్పుడో వెళ్లిపోయింది. అలాంటి కామెంట్లు వస్తే రెండో రోజు నుంచే సీన్లు లేచిపోతాయి. కానీ… చిత్రబృందం ఇప్పటి వరకూ ఆ పని చేయలేదు. ప్రతీ సీనూ, ప్రతీ పాత్ర డిటైల్డ్‌గా చెప్పడంలో తప్పులేదని, అలాంటప్పుడు సినిమా లాగ్ అవ్వడం సహజమని, అలా డిటైల్డ్‌గా చెప్పడం వల్లే… క్లైమాక్స్ ఆ రేంజులో పండిందన్నది వాళ్ల వాదన. దిల్ రాజు అయితే.. అసలు సినిమా స్లో అవ్వడం కామనే అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ స్పీడుగా సాగిందని, క్లైమాక్స్ కూడా పరుగులు పెట్టిందని, మధ్యలో కాస్త లాగ్ ఉంటే.. ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నాడు.
మహర్షి సినిమా కి కత్తెర్లు వేయకపోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఒకవేళ ట్రిమ్ చేస్తే.. ఈ సినిమాపై నెగిటీవ్‌గా మాట్లాడుకునేవాళ్లు ఇంకాస్త ఎక్కువ అవుతారు. సినిమా బాలేదని, అందుకే సీన్లు లేపేశారని చెప్పుకుంటారు. ఆ డామేజీ చిత్రబృందానికి ఇష్టం లేదు. పైగా రెండో రోజు వసూళ్లు మరీ దారుణంగా ఏం పడిపోలేదు. చాలా చోట్ల ఈ సినిమాకి వసూళ్లు సెటిల్డ్‌గానే ఉన్నాయి. రెండో పాయింటు… సినిమా డిజిటల్ రూపంలో మారిన తనవాత కత్తిరింపులు, జోడింపులు కాస్త కష్టమయ్యాయి. టైమ్ తీసుకుని ట్రిమ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆదరా బాదరా కట్ చేయకుండా… టైమ్ తీసుకుని చేస్తే ఇంకాస్త మెరుగైన ఫలితం వస్తుందని నమ్ముతున్నారు. ఒకవేళ దిల్‌రాజు, వంశీ పైడిపల్లిల మనసులు మారి.. ట్రిమ్ చేయాలనుకుంటే, సోమవారం నుంచి నిడివి తగ్గిన మహర్షిని చూడొచ్చు. లేదంటే ఇదే కొనసాగే అవకాశం ఉంది.