ఆరో విడత ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి భాజపా నేతల స్వరంలో స్పష్టమైన మార్పును అందరూ చూస్తున్నారు. 2014 మాదిరిగానే మోడీ హవా ఈసారి తుఫాను స్థాయికి చేరుకుంటుందనీ, సొంతంగానే మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ప్రచారం మొదలుపెట్టారు భాజపా నేతలు. కానీ, చివరికి దశలకు వచ్చేసరికి… రాష్ట్రాలవారీగా కోల్పోబోయే సీట్లను, ఇతర రాష్ట్రాల్లో వాటిని భర్తీ చేసుకోబోతున్నట్టు విశ్లేషణలు మొదలుపెట్టారు. ఎన్డీయే మిత్ర పక్షాలతో కలుపుకుని తాము అధికారంలోకి వస్తామంటూ రాం మాధవ్ ఈ మధ్య మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విశ్లేషణ ఈ నాయకులకు భిన్నంగా ఉంది. ఆయన ఆంధ్రాలో ఉండి మాట్లాడితే ఒకెత్తు, కానీ వరుసగా ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా ఆయన ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ, వాస్తవ పరిస్థితి ఆయనకి స్పష్టంగా అర్థమౌతోందా, లేదంటే దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా అనేది అనుమానం!
వారణాసిలో ఎన్నికల ప్రచారంలో కన్నా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ మోడీ అనే మాటే తప్ప, మరొకటి వినిపించడం లేదన్నారు! మోడీ, అమిషా సారథ్యంలో ఈసారి 300కి పైగా ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామనీ, సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కన్నా ధీమా వ్యక్తం చేశారు. మే 23 తరువాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణం చేయబోతున్నారన్నారు. మోడీని తప్ప మరొకరికి ప్రధానిగా ప్రజలు ఊహించుకోలేకపోతున్నారన్నారు! భాజపా గెలుపు మీద ఎవ్వరికీ అనుమానాల్లేవన్నారు.
సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుపై రాం మాధవ్ కి కూడా ఇంత ధీమా లేదనే చెప్పాలి! గత ఎన్నికల్లో సొంతంగా వచ్చిన సీట్లు మరోసారి దక్కితే చాలు అన్నట్టుగా రాం మాధవ్ ఈ మధ్య చాలా ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. కానీ, కన్నా మాత్రం 300 పక్కా అనేస్తున్నారు! ఏ రాష్ట్రంలో చూసినా మోడీ తప్ప మరొకర్ని ప్రధానిగా ప్రజలు అనుకోవడం లేదన్నారు. కన్నా ఉత్తరప్రదేశ్ వెళ్లారా? గతంలో ఆ రాష్ట్రంలో వచ్చిన సీట్లను ఇప్పుడు దక్కించుకునే పరిస్థితి ఉందా? ఎస్పీ, బీఎస్పీల కూటమిని భాజపా ఎలా ఢీకొంది? సొంత రాష్ట్రం ఆంధ్రాలో మాటేంటి, తమిళనాడులో పరిస్థితేంటి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో మోడీ హవా ఎలా ఉంది… ఇలా భాజపా బలంగా పోరాడాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి, రాష్ట్రాలవారీగా విశ్లేషణ చేసి… ఈ 300 ఎక్కడెక్కడ ఎన్నెన్ని వస్తాయో కన్నా లెక్క చెప్పి ఉంటే బాగుండేది. భాజపా సీనియర్లకు కూడా ఈ సమయంలో ఇది చాలా ఊరటినిచ్చే కబురు అవుతుంది కదా!