తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ… తరపున పోటీ చేయడానికి… అందరూ వెనుకడుగు వేస్తున్నారు. టీఆర్ఎస్ లో మాత్రం… టిక్కెట్ మాకంటే.. మాకని పోటీ పడుతున్నారు. నిజానికి.. ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో… పార్టీ పరంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది. కానీ.. మారిపోయిన పరిస్థితులతో… టీఆర్ఎస్ అభ్యర్థిని తట్టుకుని నిలబడటం సాధ్యం కాదని… కాంగ్రెస్ నేతలు భావిస్తూండటంతో వెనుకడుగు వేస్తున్నారు.
టీఆర్ఎస్లో మూడు స్థానాలకు 30 మంది ఆశావహులు..!
మూడు ఎమ్మెల్సీ స్థానాలపై కేసీఆర్ కొంత కసరత్తు చేశారు. ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మూడు జిల్లాల మంత్రులతో కేసీఆర్ సమావేశమై.. ఆశావహులు… బలాబలాలపై చర్చలు జరిపారు. అభ్యర్థి ఎవరైనా గెలిపించే బాధ్యతను మంత్రులపై పెట్టారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం.. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, క్యామ మల్లేష్ ప్రయత్నిస్తున్నారు. మహేందర్ రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమామాధరెడ్డి, తేరా చిన్నప రెడ్డి, వేముల వీరేశం, శశిధర్ రెడ్డి పోటీ పడుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని.. కేసీఆర్ కేబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి.. ఆయనకే చాన్స్ వస్తుందని చెబుతున్నారు. వరంగల్ స్థానంపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. బస్వరాజు సారయ్య, రవీందర్ రావు, మధుసూదనాచారి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో మధుసూదనాచారికి అవకాశం ఇస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్లో టిక్కెట్ ఇస్తామన్నా వద్దంటున్న నేతలు..!
టిక్కెట్ కోసం టీఆర్ఎస్ కిటకిటలాడుతూంటే.. కాంగ్రెస్లో మాత్రం… టిక్కెట్ ఇస్తామన్నా.. వద్దంటున్నారు. రంగారెడ్డి స్థానం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే మల్ రెడ్డి రంగారెడ్డి పోటీకి విముఖత చూపిస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి కూడా… ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. వరంగల్ నుండి కొండా మురళి , పరకాల ఇంచార్జి వెంకటరాం రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కొండా మురళీ రాజీనామాతోనే ఆ స్థానం ఖాళీ అయింది. అయితే.. ఎక్కువ మంది అనుచరులు టీఆర్ఎస్లో చేరిపోవడంతో.. ఆయన కూడా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నల్గొండ నుండి.. రాజగోపాల్ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ ని బరిలో దించాలని ప్రయత్నిస్తున్నారు. పటేల్ రమేష్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. వారెంత వరకు పోటీకి సిద్ధమవుతారన్నది అనుమానమేనని… పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.