తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇంకా పూర్తిస్థాయి ఆత్మ విశ్వాసాన్ని రాష్ట్ర నాయకత్వం ఇవ్వలేకపోతోందని చెప్పుకోవచ్చు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని… ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునేందుకు కూడా సమయం లేకుండా పోతోంది. అయితే, ఒక ఎన్నికల్లో ఓటమి ఎదురు కాగానే… ఆ తరువాత వచ్చే మరో ఎలక్షన్స్ లో సత్తా చాటుకునే ఉత్సాహంతో ఊపుతో సిద్ధం కావాలి. కానీ, కాంగ్రెస్ లో ఆ చురుకుదనమే కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు సమయంలో ఆశావహుల నుంచి ఎలాంటి నీరసమైన స్పందన వచ్చిందో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అదే పరిస్థితి పునరావృతం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు దక్కించుకోని కొంతమందికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయం చేయాలని టి. కాంగ్రెస్ భావిస్తోంది. నామినేషన్లకు రెండ్రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థుల జాబితా ప్రకటన దశకు వచ్చినట్టు సమాచారం!
కానీ, కొంతమంది ప్రముఖ నాయకులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పెద్దగా ఉత్సాహం చూపడం లేదని సమాచారం! అయితే, అధిష్టానం పేరు చెప్పి… పోటీలో కచ్చితంగా ఉండాలనీ, ఇది అధినాయకత్వం మీ మీద పెట్టిన బాధ్యత అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల పేర్లను తాము ఇక్కడ ఖరారు చేయడం లేదనీ, ఔత్సాహికుల జాబితా మాత్రమే తాము తయారు చేశామనీ, అధిష్టానం నిర్ణయం ప్రకారమే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయపడుతున్నారట!
అయితే, అభ్యర్థులుగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంటున్నవారి అనుమానం ఏంటంటే… పార్టీ నుంచి తమకు పూర్తిస్థాయి సహకారం అందుతుందా లేదా అనేది? ఇదే మాటను వారు ఓపెన్ గానే నిన్న జరిగిన సమావేశంలో వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ నుంచి తమకు పూర్తి సహకారం అందుతుందనే భరోసా లేదనీ, నాయకులు ఒక మాట మీద ఉండటం లేదని కొందరు అనేసినట్టు సమాచారం! అంటే, సొంత పార్టీ సహకారం మీదనే నమ్మకం లేని పరిస్థితి. అయితే, ఆ మధ్య జరిగిన గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదొక్కటే సానుకూల పరిణామంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు భావిస్తున్నట్టు సమాచారం. సొంత పార్టీ మద్దతు మీద అభ్యర్థులకు అనుమానాలుంటే… ఇతర పార్టీలతో బలమైన పోరాటం ఎలా సాధ్యం..?