తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేస్తున్న పర్యటనలు… జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం.. సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారని.. ఓ వర్గం జాతీయ మీడియా చెబుతూండగా.. మరో వర్గం మాత్రం.. ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు బ్యాక్ డోర్ ప్రయత్నాలు చేస్తున్నారని… చెబుతున్నారు. కానీ.. ఈ వార్తలు, విశ్లేషణలపై కేసీఆర్ నోరు మెదపడం లేదు. తన పని తాను చేసుకుంటున్నారు.
స్టాలిన్‌తో భేటీనే కీలక మలుపు కానుందా..?
డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో కేసీఆర్.. సమావేశం జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు తిరగడానికి కారణం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో… కేసీఆర్‌తో స్టాలిన్ భేటీకి అంగీకరించారంటేనే… కచ్చితంగా మరో ఆలోచన ఉన్నట్లే అర్థం. మొదటగా.. పదమూడో తేదీన భేటీ ఉంటుందని ప్రచారం జరిగినప్పుడు.. రేగిన గందరగోళంతో.. డీఎంకే వర్గాలు.. అలాంటి భేటీ లేదని చెప్పినప్పటికీ.. తర్వాత మనసు మార్చుకుని.. కేసీఆర్‌కు ఆహ్వానం పలికాయి. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచార గడువు దగ్గరకు వచ్చేసినా… ఒక రోజు కేసీఆర్ కోసమే.. ఆ ప్రచారాన్ని స్టాలిన్ వాయిదా వేసుకుంటున్నారు. అంటే.. ఆయన మరో ఆలోచనలో ఉన్నట్లేనని.. రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మమతా బెనర్జీతోనూ టచ్‌లో కేసీఆర్…!
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నానని.. మమతా బెనర్జీ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు రాజకీయ కార్యాచరణ సిద్ధం అవుతోంది. మమతా బెనర్జీ, కేసీఆర్, స్టాలిన్, జగన్ పార్టీలతో పాటు ..ఇతర కొన్ని చిన్న పార్టీలను కలుపుకుంటే.. కనీసం వంద సీట్లు వస్తాయనే అంచనా ఉంది. అందుకే..ఈ వంద మంది సమైక్యంగా మారితే.. ప్రభుత్వం చేతుల్లోకి వస్తుందనే ఫార్ములాను కేసీఆర్ పాటిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో… మమతా బెనర్జీ కూడా మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. మమతా బెనర్జీకి.. ఎలాంటి రిజర్వేషన్లు పెట్టుకోలేదు. ఆమె ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. బెంగాల్లో స్వీప్ చేస్తే.. ఆమె.. ఏ కూటమిలో చేరడం కన్నా… ప్రధానమంత్రి పీఠంపై మాత్రమే గురి పెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని కేసీఆర్ అనుకూలంగా మల్చుకుని.. కొత్త కూటమిని తెరపైకి తెస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ అసాధ్యమేమీ కాదు..!
ప్రాంతీయ పార్టీలు అధికారం అందుకోవడం ముఖ్యం. కేసీఆర్ ఆలోచన కూడా అదే. బీజేపీ మద్దతు ఇస్తుందా.. కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా.. అన్నది కాదు ముఖ్యం. ప్రాంతీయ పార్టీలుక ఏదో ఓ జాతీయ పార్టీ మద్దతు ఇస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకే ఫెడరల్ ప్రంట్ కీలకం అవుతోంది. బీజేపీ ఎలా అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప… ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వదు. ఇచ్చే చాన్స్ ఉంది కాంగ్రెస్సే. బీజేపీని నిలువరిస్తేనే.. ఆ పార్టీకి భవిష్యత్. ఈ కోణంలోనే… ప్రాంతీయ పార్టీలు.. ఫెడరల్ ప్రంట్‌గా మారి… కాంగ్రెస్‌కు మద్దతివ్వక తప్పని పరిస్థితి కల్పించాలని భావిస్తున్నాయి. ఈ ఆలోచనతోనే కేసీఆర్… యాత్రలు చేస్తున్నారు. వీలైనంతగా.. పాజిటివ్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.