తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చేవ లేకుండా పోయింది. టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పని తీరు.. సొంత పార్టీ నేతల్ని కూడా…నిరాశకు గురి చేస్తోంది. తన వర్గం అనుకున్న వారంతా.. తనను పొగిడి.. అదే నోటితో టీఆర్ఎస్లోకి వెళ్తున్నామని చెబుతున్నారు. తన వ్యతిరేక వర్గం అనుకున్న వారు కూడా.. ఉత్తమ్‌ది అసమర్థ నాయకత్వం అని తిట్టి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో రెండు వైపులా.. ఉత్తమే బ్యాడ్ అయిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పీసీసీ నుంచి వైదొగలడమే ఉత్తమం అని ఉత్తమ్ ఆలోచనకు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
టీ పీసీసీది గాలివాటం రాజకీయం..!
తెలంగాణలో ప్రతిపక్షంగా ఉందా.. లేదా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర నాయకత్వం .. నిష్క్రియాపరత్వం కారణంగా.. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది జంపయిపోయారు. ఇక మిగిలినవారులో.. ముగ్గురు, నలుగురు.. పిలుపుచొచ్చాయని.. పిలుపులొస్తున్నాయని.. పిలుస్తారేమోనని.. ఎదురు చూస్తున్నారు. దీనికంతటికి కారణంగా.. పీసీసీ రాష్ట్ర నాయకత్వమే. ఒక్క ఎమ్మెల్యేకూ… నమ్మకం కలిగించలేకపోవడంతో… ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలోనే … టీఆర్ఎస్ పెద్దలతో కుమ్మక్కయ్యారన్న ప్రచారం దగ్గర్నుంచి… నేటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ.. ఏ ఒక్క పనిని వ్యూహాత్మకంగా చేయడం లేదు. దాంతో… ఉత్తమ్ పై.. రాహుల్ గాంధీ కూడా నమ్మకం కోల్పోయారు.
తీసేయడం కంటే వైదొలిగితే ఉత్తమ్ గౌరవం నిలబడుతుందా..?
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై బాధ్యత తీసుకోవాలంటూ… ఉత్తమ్ పై అనుచరులు అనుకున్నవారే మండిపడుతూండటంతో ఆయన హర్టయ్యారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను సైతం తన అసమర్థతగానే అంటూ జరుగుతోన్న ప్రచారం మీద కూడా కెప్టెన్ ఆవేదన చెందుతున్నారట. ప్రతిపక్షంలో ఉండి పార్టీ నిర్వహణ ఎంతో భారమైనా..అన్ని వ్యయప్రయాసలకు ఓర్చి తాను పార్టీని నడిపిస్తున్నానననే భావనలో ఉత్తమ్ ఉన్నారు. తాను తెగ కష్టపడిపోతున్నా.. ఇతరులు సహకరించకుండా.. ఇంకా విమర్శిస్తున్నారని.. ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో… పార్టీకి అంతో ఇంతో జవసత్వాలు రావాలంటే.. ఉత్తమ్‌ను మార్చాలన్న ప్రచారం జరుగుతూండటంతో… ముందుగానే.. వైదొలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన.. ఉత్తమ్ చేస్తున్నారంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త టీం..!
ఉత్తమ్ ఇప్పటికే ఇప్పటికే నాలుగేళ్ల పదవికాలన్ని పూర్తి చేసుకున్నారు. రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సోనియా హయాంలో నియమించిన పీసీసీ అధ్యక్షులందరిని కొనసాగిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దాంతో ఇప్పటివరకు ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ గా కంటిన్యూ అవుతున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాలని జీర్ణించుకోలేక పోతున్న అధిష్టానం పెద్దలు పార్లమెంట్ ఫలితాల తర్వాత టీకాంగ్రెస్‌లో సమూల మార్పులు ఖాయమని అంటున్నారు.