జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ కార్యక్రమాలు మళ్లీ ప్రారంభించారు. పార్టీ అభ్యర్థులతో రివ్యూ కాని రివ్యూ చేశారు. పోలింగ్ సరళి లాంటి వాటి జోలికి వెళ్లకుండా.. తన అంచనా చెప్పారు. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే.. ఈ ఎన్నికలపై… జనసేన అధినేత ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదు. తను గెలుస్తాడా.. లేదా అన్నదానిపైనా ఆయనకు అంత గొప్పగా నమ్మకం ఉన్నట్లుగా కనిపించలేదు. కానీ… ఆయన భవిష్యత్ రాజకీయంపై మాత్రం… మంచి మాటలే చెబుతున్నారు.
ఫలితాలు ఎలా ఉన్న పవన్ డోంట్ కేర్..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో… జనసేన పార్టీ రేసులో ఉందని.. పవన్ కల్యాణ్ కూడా అంగీకరించలేకపోతున్నారు. వీవీ లక్ష్మినారాయణ లాంటి నేతలు.. తమ పార్టీ 88 సీట్లలో గెలుస్తుందని… ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అలాంటి మాటలు చెప్పడానికి సిగ్గుపడిపోతున్నారు. తనలో తానే ముసిముసిగా నవ్వుకుని… అలా ప్రిడిక్ట్ చేయనని.. తన పని తాను చేసుకుపోతానని చెబుతున్నారు. అంటే… ఈ ఎన్నికల్లో జనసేనకు కనీస ఫలితాలు వస్తాయని కూడా ఆయన అంచనా వేయలేకపోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే… ఫలితాలపై ఆశలు పెట్టుకోవద్దంటూ.. పార్టీ క్యాడర్‌కు.. కూడా చెబుతున్నారు.
పార్టీ నిర్మాణం అంత కష్టంగా ఉందా…?
గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పదే పదే చెప్పారు. ప్రస్తుతం ఆయన అదే మాటలు చెబుతున్నారు. తనది సుదీర్ఘ రాజకీయ ప్రణాళిక అని ఐదేళ్ల నుంచి చెబుతున్నారు. కానీ ఈ ఐదేళ్లలో భవిష్యత్ రాజకీయాల కోసం ఆయన వేసిన ప్రణాళికలేమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే.. ఆయన ఏమీ ప్రణాళికలు వేయలేదు మరి. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వతా స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపునిస్తున్నారు. అక్కడ విజయం సాధించాలంటే.. ఆ స్థాయిలో పార్టీ నిర్మాణం ఉండాలి. ఐదేళ్లలో కనీసం.. అలాంటి ప్రయత్నం కూడా పవన్ కల్యాణ్ చేయలేదు. ఫ్యాన్స్ మాత్రమే… పార్టీ అన్నట్లుగా వ్యవహారం సాగిపోయింది. ఇప్పుడు.. అతి అంత తేలిక కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. పార్టీ నిర్మాణం చాలా క్లిష్టమైనదని అంటున్నారు. కానీ.. ప్రయత్నం చేస్తేనే కదా.. అసలు క్లిష్టమైనదో.. సులువైనదో తెలిసేది. గ్రామగ్రామాన.. అభిమానులు ఉంటారని తెలిసి కూడా.. ఎందుకు .. వారిని పార్టీ నిర్మాణంలో భాగం చేయలేకపోయారో.. జనసేన పెద్దలు ఆలోచించాలి కదా..!
ఇప్పుడు కూడా ఎవరూ ఆశయం కోసం రాలేదు.. ఆశతోనే వచ్చారు..!
ప్రజారాజ్యం సమయంలో… నేతలందరూ.. ఆశతో వచ్చారని.. ఆశయంతో రాలేదని.. పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు.. జనసేన లో కూడా.. నేతలు.. ఆశతోనే వచ్చారు. అది ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టే తెలిపోతుంది. పవన్ నిలబెట్టిన అభ్యర్థుల్లో అంతో ఇంతో బలమైన వారు అనుకున్న వారిలో.. 99 శాతం ఇతర పార్టీల్లో అవకాశం దక్కక.. టిక్కెట్లపై ఆశతో వచ్చినవారే. వారు జనసేనకు అండగా ఉంటారనుకోవడం అమాయకత్వమే. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత… పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. పార్టీలో ఉన్న చిన్నా చితకా నేతలు… స్థానిక ఎన్నికల్లో చాన్స్ ఇస్తారనుకుంటే.. ప్రధాన పార్టీల్లో చేరిపోతారు. అప్పుడైనా పవన్‌కు .. వాళ్లంతా ఆశయంతో రాలేదు.. ఆశతో వచ్చారని తెలుస్తుంది. కానీ అప్పుడు కొత్తగా చేయడానికి ఏముంటుంది..?