మంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చి చేరారు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. గులాబీ కండువా కప్పుకోకుండా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా తెరాస నేతగా ఎన్నికల వరకూ కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతారేమో అనుకుంటే… అప్పుడు ముందుకు రాలేదు. మరోసారి ఎంపీగా తెరాస తరఫున పోటీకి అవకాశం ఉన్నా కూడా… ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల సీజన్ వచ్చింది. మండలి సభ్యునిగా గుత్తా పేరునే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఖరారు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న మండలి ఎన్నికల్లో గుత్తాకి అవకాశం దక్కలేదు. దీంతో గుత్తాకి ఎమ్మెల్సీ సీటు ఎప్పుడు ఇస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
నేరుగా ఎన్నికల్లో పాల్గొని, పార్టీ తరఫున పోరాడి గెలవాలనే ఉద్దేశం గుత్తాకి లేనట్టుగా కనిపిస్తోంది! పోటీ పడకుండా పదవి రావాలనేదే ఆయన లక్ష్యంగా ఉంది. అందుకే, తెరాస నుంచి వరుసగా పోటీలకు అవకాశాలున్నా కూడా ఆయన వద్దంటూ తప్పుకుంటున్నారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు ఖాళీ అయినా కూడా… ఆయన పోటీకి దిగనంటున్నారు! అలాగని క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా… అంటే, అదీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కేబినెట్ లో ఉండాలన్నది ఆయన చిరకాల కోరిక. ఇదే విషయాన్ని ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా గుత్తా చెప్పుకున్నారట. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ ను నడిపించాలని, ఆ తరువాత ఆ సంగతి చూద్దామని కేసీఆర్ ఆయనకి చెప్పినట్టుగా సమాచారం.
లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎలాగూ ఉంటుంది. వీలైతే ఈలోగానే గవర్నర్ లేదా ఎమ్మెల్యేల కోటాలో గుత్తాని ఎమ్మెల్సీ చేయడం కోసమే సీఎం కూడా వేచి చూస్తున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి. ఒకవేళ కేబినెట్ విస్తరణ నాటికి ఆ కోటాల్లో ఎన్నికలు జరగకపోయినా… ముందుగా గుత్తాకి పదవి దక్కడం ఖాయమనే ధీమాతో ఆయన అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి, గుత్తా ఎమ్మెల్సీ అవుతారు.. కానీ, ఇప్పుడు కాదు! నేరుగా ఎన్నికలు లేని పరిస్థితి కోసం ఎదురుచూస్తున్నారు.