నాలుగు రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తెలిసిందే. ధర్నాచౌక్ వద్ద ఈ ఇద్దరూ బాహాబాహీకి దిగారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై కుర్చీ కోసం ఈ గొడవ జరిగింది. అయితే, ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చర్యలకు దిగింది. నగేష్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందిరా పార్క్ వద్ద జరిగిన గొడవ తరువాత క్రమశిక్షణ సంఘానికి లిఖిత పూర్వకంగా వీహెచ్ వివరణ ఇచ్చారు. అలాగే, నగేష్ కూడా సంఘం ముందు హాజరై జరిగింది వివరించారు. అనంతరం, సీనియర్ నేత వీహెచ్ పై నగేష్ అనుసరించిన వైఖరి సరిగా లేదన్న కారణంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టుగా సంఘం ప్రకటించింది.
దీంతో ఈ గొడవ సద్దుమణిగినట్టే అని చెప్పలేం. ఎందుకంటే, క్రమశిక్షణ సంఘం తీసుకున్న చర్యలపై నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అన్యాయంగా చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన వాపోయారు. దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. వేదికపైకి ఎక్కలేని పరిస్థితిలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా ఉంటే, ఆయనకి సాయం చేద్దామని తాను వెళ్లాననీ, ఈలోగా వీహెచ్ కల్పించుకుని కుంతియా కంటే ముందు వేదిక మీదికి నువ్వెక్కినవేందిరా అంటూ ఆగ్రహించారన్నారు. నీ డ్రామాలు చాలా అయిపోయినయి దిగు దిగురా అంటూ తనను తోసేశారనీ, కిందకి పడ్డ తరువాత మాత్రమే తాను రియాక్ట్ అయ్యానని నగేష్ చెప్పారు. ఈ ఘటనకు మూల కారణమైన హన్మంతరావును వదిలేసి, తనను బలి పశువు చేశారన్నారు. క్రమశిక్షణ సంఘంలో ఉన్నవారంతా వీహెచ్ కి ఎప్పట్నుంచో దోస్తులనీ, తొత్తులనీ విమర్శించారు. ఎప్పుడూ బీసీల గురించి మాట్లాడే హన్మంతరావు, బీసీలపైనే దాడులకు దిగుతున్నారన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో తాను వదిలిపెట్టనని నగేష్ అన్నారు.
క్రమశిక్షణ చర్యలతో ఈ వివాదం సద్దుమణుగుతుంది అనుకుంటే… ఇప్పుడు వీహెచ్ పై చర్యలుంటే తప్ప నగేష్ వెనక్కి తగ్గననే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే, పార్టీ నేతలపై వీహెచ్ ఈ మధ్య తీవ్ర విమర్శలూ వ్యాఖ్యానాలు బహిరంగంగానే చేస్తున్నారు. ఆయన తీరుపై పార్టీలో కొంతమందికి గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో న్యాయ పోరాటానికి వెళ్తానంటున్న నగేష్ కి తెర వెనక నుంచి ఎవరైనా మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు! ఏదేమైనా, ఈ పంచాయితీ ఇక్కడితో ఆగేట్టు ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఈ విషయంలో కూడా హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి!