సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 9 రోజుల్లో రానున్నాయి. కౌంట్‌డౌన్‌లో భాగంగా.. పోలింగ్ ప్రచార సరళిని ఓ సారి విశ్లేషించుకుందాం..!. ఎప్పుడూ లేని విధంగా.. ఈ సారి ఎన్నికల సంఘం… ఎన్నికల షెడ్యూల్ రూపకల్పన విషయంలో… అనూహ్యంగా వ్యవహరించింది. ఆ ప్రణాళికలో అసంబద్ధత ఉంది. బీజేపీ నేరుగా పోటీ పడుతున్న రాష్ట్రాల్లో సుదీర్ఘంగా ప్రక్రియ సాగింది. బీజేపీకి ఏ మాత్రం పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో… రెండు విడతల్లో ముగించేశారు. ఈ క్రమంలో… పోలింగ్ సరళి ఎలా జరిగిందో పరిశీలిద్దాం..!
బీజేపీ దున్నేసిందనే మాటే ఎక్కడా వినిపించడం లేదు..!
తొలి మూడు దశల ఎన్నికల తర్వాత బీజేపీ డీలా పడిందన్న ప్రచారం ఊపందుకుంది. ఓపెనింగ్ ఫెయిల్ అయిందనే అంచనాకు వచ్చారు. ఎందుకంటే.. తొలి మూడు విడతల్లో ఎక్కువగా పోలింగ్ జరిగింది దక్షిణాది రాష్ట్రాల్లోనే. ఎందుకంటే.. మొదటి మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గతంలో వచ్చినది కూడా ఏమీ లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ గతంలో గొప్ప విజయాలు ఏమీ సాధించలేదు. ఏమైనా అయితే మిత్రపక్షాల సాయం మాత్రం పొందగలదు. అయితే ఆ తర్వాత విడతల్లో జరిగిన యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లోనూ ఎదురుగాలి వీచినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. విడతకి.. విడతకి.. ప్రచారవ్యూహాన్ని మార్చుకుంటూ బీజేపీ వెళ్లింది. అది విద్వేష ప్రచారం దిశగా వెళ్లడంతో.. బీజేపీ ఆశలు వదిలేసుకుందనే ప్రచారం ఊపందుకుంది.
ఫనిషింట్ టచ్ అయినా ఇస్తారా..?
ఏడు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏడో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 19న మొత్తం 59 నియోజకవర్గాల్లో ఓటింగ్ తో దేశం మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో 13 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. దానితో అతి పెద్ద రాష్ట్రంలోని 80 నియోజకవర్గాలలో పోలింగ్ పరిసమాప్తమవుతుంది. పంజాబ్‌లో 13 నియోజకవర్గాలు, పశ్చిమ బెంగాల్లో 9, బిహార్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు , జార్ఖండ్‌లో మూడు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఏకైక నియోజకవర్గానికి ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. కానీ ఏ రాష్ట్రంలోనూ బీజేపీ కూటమికి పరిస్థితులు అనుకూలంగా లేవు. యీపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు చావుదెబ్బకొట్టనట్లే. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- అకాలీదళ్ కూటమి ఓడిపోయిన తర్వాత రెండు పార్టీలు బాగా బలహీనమైపోయింది. బీజేపీ పోటీ చేస్తోందే మూడు చోట్ల.. అక్కడా అవకాశాలు అంతంతమాత్రమే.
పంజాబ్‌లో ఆశలు నిల్..! బీహార్‌లో మిణుకు..మిణుకు..!
బిహార్ ఆఖరి దశలో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. నలందా, పట్నా సాహిబ్, పాటలీపుత్ర, ఆరా లాంటి నియోజకవర్గాల్లో ఈ సారి పోలింగ్ జరుగుతుంది. పట్నా సాహిబ్ నియోజకవర్గం పోలింగ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు బీజేపీలో ఉండి మోదీపై విమర్శనాస్త్రాలు సంధించిన సినీనటుడు శత్రుఘ్న సిన్హా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ రంగంలోకి దించడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా తయారైంది. ఏడో దశలో ఆర్జేడీకి పట్టున్న ప్రాంతాలు ఉండటంతో లాలూ కుటుంబ పరపతిపై విజయం సాధించే వీలుంది. హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు లోక్ సభా నియోజకవర్గాలున్నాయి. గత పదేళ్లుగా హిమాచలంలో బీజేపీ బాగా పుంజుకుంది. ఈ సారి కూడా బీజేపీకే అవకాశాలున్నాయి.
మొత్తంగా.. ఏడు విడతల పోలింగ్ సరళిని చూస్తే.. బీజేపీకి.. అంత ఉత్సాహంగా ఏమీ లేదన్న విషయం స్పష్టమవుతుంది. అదే సమయంలో… ప్రాంతీయ పార్టీల జోరు మాత్రం స్పష్టంగా కనిపించింది.