తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో భేటీ అయ్యారు కదా! భాజపాయేతర కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు గురించి చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలపై కేవలం కేసీఆర్ కోణం నుంచి మాత్రమే సాక్షి పత్రిక కథనాలు రాసింది. తెలంగాణ, ఆంధ్రా ఎడిషన్లలో కూడా ఒకే రకమైన ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ చర్చల్లో కేసీఆర్ మాట్లాడింది మాత్రమే రాశారు! దానికి స్టాలిన్ ఎలా స్పందించారో, అసలు ఆయన రెస్పాండ్ అయ్యారో లేదో కూడా సాక్షి కథనంలో కనిపించదు. కానీ, కేసీఆర్ ప్రతిపాదనలపై స్టాలిన్ సానుకూలంగా స్పందించేశారనీ, మరోసారి కలిస్తే ఫ్రెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా విశ్లేషించేసింది సాక్షి!
జాతీయ పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడితే దాని వల్ల రాష్ట్రాల ఆకాంక్షలు నెరవేరడం లేదనీ, ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరితేనే దేశంలో నిజమైన అభివృద్ధి సాధ్యమని స్టాలిన్ కి కేసీఆర్ చెప్పినట్టు రాశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయాలు భిన్నంగా ఉంటాయనీ, దాదాపు 20 ఏళ్ల కిందిటి మాదిరిగా ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా మారతాయని స్టాలిన్ కి కేసీఆర్ చెప్పినట్టు రాశారు. మొత్తానికి, కేసీఆర్ ప్రతిపాదనకు స్టాలిన్ అనుకూలంగా స్పందించారని తెరాస నేతలు చెబుతున్నారంటూ రాసేశారు! ఫెడరల్ ఫ్రెంట్ లో కలిసి వచ్చేందుకు డీఎంకే ఆసక్తిగా ఉందని విశ్లేషించేశారు!
కేసీఆర్ ప్రతిపాదనపై స్టాలిన్ అంత ఆసక్తితో ఉంటే… ఆ విషయాన్ని ఆయనే మీడియాతో చెప్పాలి కదా, చెప్పలేదే? ఈ భేటీలో పాల్గొన్న టీఆర్ బాలు కూడా మీడియాతో ఏమీ మాట్లాడలేదే..? మరో నేత దురైమురుగన్ నవ్వుకుంటూ స్టాలిన్ నివాసం నుంచి బయటకి వస్తూ… ఏం జరిగిందని అడిగిన మీడియాకు… నాకేం తెలియదు అంటూ సమాధానం చెప్పి వెళ్లిపోయారే..? చెన్నై నుంచి బయల్దేరే ముందు కేసీఆర్ అయినా మీడియాతో మాట్లాడలేదే..? ఇప్పటికే కాంగ్రెస్ తో తమకు పొత్తు ఉందనీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తానే ప్రపోజ్ చేశానని కేసీఆర్ కి స్టాలిన్ చెప్పారట! ఆ విషయం సాక్షిలో కనిపించలేదు. వీలైతే మీరూ కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వండని కేసీఆర్ ను స్టాలిన్ కోరినట్టు సమాచారం. అది కూడా ఆ పత్రికలో కనిపించలేదు. మరి, ఏ లెక్కన స్టాలిన్ సానుకూలంగా ఉన్నట్టుగా కథనాలు రాసేశారో వారికే తెలియాలి.