అధికారంలోకి రాబోతున్నది తామే అనే ధీమా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో లేదని విమర్శించారు వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… టీడీపీకి రాబోయే సీట్లెన్నో చెప్పకుండా గెలిచేది తామే అని చంద్రబాబు చెబుతుండటంలోనే ఆయనకి ఉన్న భయాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. కొన్ని సర్వేల పేర్లను చెప్పి, అంతా అనుకూలంగా ఉందనే భ్రమను కల్పించారనీ, తాను చేసిన ఈ పని తప్పు అని ఎన్నికల ఫలితాల తరువాత ఒప్పుకోవాల్సి వస్తుందన్నారు. అనుకూలంగా ఉండే పత్రికల ద్వారా పార్టీ శ్రేణులను ఓదార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓపక్క గెలుస్తామని ధీమాగా చెబుతూనే, మరోపక్క కౌంటింగ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని పార్టీ కేడర్ కి చెబుతున్నారన్నారు.
ఎన్నికల ఫలితాల తరువాత ఎవరైనా రివ్యూలు చేసుకుంటారనీ, కానీ ఈయన ముందుగానే పార్టీ నేతలతో రివ్యూలు చేసుకుంటూ… త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయీ, ఎవ్వరూ డీలాపడాల్సిన పనిలేదూ, అందరూ నా చుట్టూనే ఉండండి అని చెబుతున్నాడని సజ్జల వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల గురించి ప్రజలను గందరగోళానికి గురిచేయడం ఇష్టం లేకనే… పోలింగ్ జరిగిన రోజు మాత్రమే దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారనీ, అంతే తప్ప ప్రతీరోజూ ఇదే పనిగా ఆయన మాట్లాడలేదన్నారు. జాతీయ పార్టీల నేతలతో చంద్రబాబు ఫొటోలు మాత్రమే దిగుతున్నారనీ, ఎన్నికల ఫలితాల తరువాత వైకాపా కూడా జాతీయ రాజకీయాల్లో కీలకం కాబోతుందని చెప్పారు. ఢిల్లీలో జగన్ కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏమీ లేదనీ, కరువు, మంచినీటి సమస్యపై గతంలో ఎప్పుడైనా మంత్రివర్గంలో చంద్రబాబు చర్చించారా అని ప్రశ్నించారు? ఇది చంద్రబాబుకి చివరి కేబినెట్ కాబోతోందన్నారు. అంతేకాదు, టీడీపీకి టైమ్ అయిపోయిందనీ, ఈ ఫలితాల తరువాత ఏపీలో ఆ పార్టీ ఉండదన్నారు!
ఫలితాల గురించి జగన్ మాట్లాడకపోవడమే అవి తమకు సానుకూలంగా ఉన్నాయనడానికి చిహ్నంగా సజ్జల చెప్పారు. మరి, అంత ధీమా ఉన్నప్పుడు ఇప్పుడీ కామెంట్స్ చెయ్యాల్సిన పని కూడా లేదు కదా! ఎలాగూ మరో పదిరోజుల్లో లెక్కలు తేలిపోతాయి కదా. ఇంకోటి… ఇప్పుడు జరుగుతున్న కేబినెట్ భేటీ అనవసరం అంటున్నారు. కరువు, తాగునీటి సమస్య ఉందని వారే చెబుతున్నారు. అలాంటప్పుడు, ఇదే అంశాలతో భేటీ పెట్టడం ఎలా తప్పు అవుతుంది? ఇంకా రిజల్ట్స్ రాకముందే… ఏపీలో టీడీపీ పనైపోయిందనీ, పార్టీ ఉండదనే స్థాయిలో ఆయన వ్యాఖ్యానిస్తున్నారంటే… వైకాపా ఆలోచనా విధానం ఎలా ఉందనేది అర్థమౌతూనే ఉంది.