ఫిబ్రవరి 5వ తేదీ నుండి నాలుగు రోజుల పాటు కరాచీలో జరుగబోయే సాహిత్య సమ్మేళనానికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అతిధిగా ఆహ్వానించబడ్డారు. ఆయనతో బాటే మరో 17మందికి కూడా ఆహ్వానాలు అందాయి. వారందరికీ వీసాలు కూడా వచ్చేయి. అనుపమ్ ఖేర్ ఒక్కరికే రాలేదు. తనకి పాక్ ప్రభుత్వం వీసా ఇవ్వడానికి నిరాకరించినట్లు ఆయన తెలిపారు. దానిని పాక్ హైకమీషనర్ ప్రధాన కార్యదర్శి ఖండించారు. అనుపమ్ ఖేర్ అసలు వీసా కోసం దరఖాస్తే చేసుకోలేదని చెప్పారు. దరఖాస్తు చేసుకోకుండానే ఆయనకి వీసా ఎలా నిరాకరిస్తామని ప్రశ్నించారు.
దానిపై అనుపమ్ ఖేర్ స్పందిస్తూ “పాక్ హోం శాఖ మిగిలిన 17మందికి దరఖాస్తు చేసుకోకుండానే వీసాలు జారీ చేసింది. నాకొక్కడికే నిరాకరించింది. ఇలాగ జరగడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో కూడా రెండు సార్లు ఈవిధంగానే జరిగింది. ఇది మూడోసారి,” అని ట్వీట్ చేసారు.
డిల్లీలోని పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ వెంటనే అనుపమ్ ఖేర్ కి ఫోన్ చేసి “సార్..మీరు గొప్ప ఆర్టిస్ట్. మేము మిమ్మల్ని చాలా అభిమానిస్తాము…గౌరవిస్తాము. మీరు ఒప్పుకొంటే గంటలోగా మీకు వీసా ఏర్పాటు చేస్తాను,” అని చెప్పారు. కానీ అప్పటికే ఆ తేదీలలో వేరే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మాట ఇచ్చేసినందున తనకు వీసా అవసరం లేదని అనుపమ్ ఖేర్ తెలిపారు. వారిరువురు ట్వీటర్ ద్వారా కూడా దీని గురించి కొన్ని మెసేజులు పెట్టుకొన్నారు.
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమయిన పద్మభూషణ్ బిరుదునిచ్చి అనుపమ్ ఖేర్ ని గౌరవిస్తే, వీసా నిరాకరించి పాక్ ప్రభుత్వం ఆయనని అవమానించింది. బహుశః అందుకే పాక్ హైకమీషనర్ స్వయంగా ఫోన్ చేసి వీసా ఏర్పాటు చేస్తానని అడిగినా ఆయన తిరస్కరించి ఉండవచ్చు. బహుశః ఇక్కడితో అనుపమ్ ఖేర్-పాక్ వీసా కధ ముగిసిపోతుందో ఇంకా కొనసాగుతుందో చూడాలి.