ఏపీ మంత్రివర్గ సమావేశం…. గతవారం రోజులుగా తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన సంగతి తెలిసిందే. జరుగుతుందా జరగదా… ఈసీ అనుమతి ఇస్తుందా, కోడ్ అమల్లో ఉందన్న పేరుతో ఏవైనా సాంకేతిక అంశాలను తెరమీదికి తెచ్చి అడ్డుకుంటారా అనే టెన్షన్ టీడీపీ వర్గాల్లో ఉండేది. అయితే, ఎట్టకేలకు ఈసీ నుంచి అనుమతి రావడం, ముందుగా అనుకున్న ప్రకారమే అజెండాలో అంశాలకు మాత్రమే పరిమితమై కేబినెట్ లో చర్చించడం జరిగింది. కరువు, ఫొని తుఫాను నష్టం, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులకు సంబంధించిన ముఖ్యాంశాలను సీఎం సమక్షంలో జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు. ఫొని తుఫాను వల్ల రూ. 58 కోట్ల పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు సీఎం చెప్పారు. ఉపాధి హామీ పనుల నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలనీ, పనుల జాప్యం వల్ల కొన్ని జిల్లాల్లో ప్రజలు వలసలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని కేబినెట్ అభిప్రాయపడింది. కేంద్రం నుంచి ఇప్పటికే హామీ ఇచ్చింది కాబట్టి, బ్యాంకుల నుంచి రుణాలు పొందైనా సరే ఉపాధి హామీ బిల్లులు క్లియర్ చేయాలనే సూచనను మంత్రులు ఈ సమావేశంలో చేశారు.
ఇక, ఈ భేటీలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే… సీఎస్ సుబ్రమణ్యం ఈ భేటీలో ఎలా వ్యవహరించారు, ఆయనతో ముఖ్యమంత్రీ ఇతర మంత్రులు ఎలా వ్యవహరించారు అనేదానిపై ఎక్కువ ఆసక్తి ఉంది. ఎందుకంటే, ఈ భేటీకి ముందు జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో సీఎస్, సీఎం మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తిన వాతావరణం కనిపించింది. ఇద్దరూ పంతాలకు పోతున్నట్టుగా ఓ సందర్భంలో కనిపించారు. ఓ దశలో ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలపై కూడా సీఎస్ ఆరా తీశారు. అయితే, ఈ కేబినెట్ సమావేశానికి వచ్చేసరికి… సీఎం, సీఎస్ ల మధ్య ఏర్పడిన దూరం తగ్గినట్టుగానే కనిపిస్తోంది.
ఫొని తుఫాను సమయంలో సీఎస్ చేపట్టిన సహాయ చర్యలను ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా అభినందించడం విశేషం! రాజకీయపరంగా మంత్రులూ ఎమ్మెల్యేలు అందుబాటు లేకపోయినా, అధికారులను సమన్వయ పరచి తుఫాను సమయంలో చక్కని పనితీరు కనబరచారంటూ ఏపీ కేబినెట్ ఆయన్ని మెచ్చుకుంది. ఇతర అంశాలు చర్చిస్తున్న సమయంలో కూడా మంత్రులూ సీఎస్ ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలోనే సమావేశం జరిగిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి, సీఎస్ లు నవ్వుతూ సమావేశంలో కనిపించడం కూడా గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడ్డట్టే అయింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి… తమకు అధికారులతో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులూ లేవనీ, ఇప్పుడు ఈసీ వల్ల మాత్రమే కొన్ని ఇబ్బందులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి, ఈ ప్రభుత్వ చివరి కేబినెట్ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో ముగిసింది.