కోల్ కతాలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది. నిజానికి, ఈ ర్యాలీకి మమతా బెనర్జీ సర్కారు మొదట అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు, అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ కి ఇచ్చిన అనుమతులను కూడా ప్రభుత్వం మొన్ననే రద్దు చేసినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో షా ర్యాలీ కోల్ కతాలో జరిగింది. ర్యాలీ ప్రారంభం కాగానే అడ్డుకున్న అధికారులు… అనుమతి పత్రాలను చూపించాలని కోరారు. ఆ తరువాత, కాసేపటికి ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ రావడంతో ర్యాలీ మొదలైంది. అలా మొదలైన ర్యాలీ వివేకానంద కాలేజీ వరకూ బాగానే సాగింది. ఈ కాలేజీ గోడల మీద గో బ్యాక్ అమిత్ షా అంటూ పెద్ద ఎత్తు పోస్టర్లు కనిపించేసరికి… భాజపా కార్యకర్తలు ఆవేశానికి లోనయ్యారు. కాలేజీలోకి రాళ్లు విసిరి, అక్కడున్న ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆ తరువాత, విద్యార్థులకు మద్దతుగా లెఫ్ట్ శ్రేణులు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
ఈ హింసాత్మక ఘటనపై అనంతరం స్పందించిన అమిత్ షా…. దీనికి కారణం మమతా బెనర్జీ అంటూ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలే ఈ గొడవకి కారణమనీ, దీనిపై ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉందనీ, మమతా సర్కారుపై ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో బయటపెడతారనీ, ఓటుతోనే ఈ గొడవలకు కారణమైన మమతా పార్టీ వర్గాలకు ప్రజలు బుద్ధి చెప్పాలంటూ అమిత్ షా బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు! భాజపా ర్యాలీని చూసి ఓర్వలేక ఇలా అడ్డుకునే ప్రయత్నం చేశారనీ, అయినాసరే ర్యాలీని దిగ్విజయం చేసిన భాజపా కార్యకర్తలకు షా ధన్యవాదాలు చెప్పారు. ఈ ఘటనపై మమతా స్పందిస్తూ… రోడ్ షో పేరుతో కొంతమంది గూండాల సాయంతో అమిత్ షా రెచ్చిపోయారనీ, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమయ్యారనీ, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని సైతం కూలదోయడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ లో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవనీ, భాజపా ర్యాలీ సందర్భంగా ఇది జరగడం సిగ్గు చేటు ఆమె విమర్శించారు.
వాస్తవానికి, బెంగాల్ లో ఇలాంటి ఓ పరిస్థితి మొదట్నుంచీ భాజపా కోరుకుందని అనేవారూ లేకపోలేదు! ఎందుకంటే, ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర్నుంచీ చూసుకుంటే… జై శ్రీరామ్ అంటూ మాత్రమే అమిత్ షా ప్రచారం చేస్తున్నారు. రాముడిని ఇండియాలో కాకుండా పాకిస్థాన్ లో గుర్తు చేసుకోవాలని మమతా చెప్తున్నారా అంటూ వివాదాస్పదం చేసే పనిలోనే షా ఉన్నారనడంలో సందేహం లేదు! ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి తీసుకొచ్చి… తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది షా వ్యూహంగానే కనిపిస్తోంది! అంతేతప్ప, గడచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి మరోసారి అధికారం పొందే విధంగా భాజపా కార్యాచరణ బెంగాల్ తో సహా దేశంలో ఎక్కడా కనిపించలేదు! కోల్ కతాలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు భాజపాకి ఏ రకంగా లాభిస్తాయో చూడాలి.