తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్లాన్లు.. ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదు. ఏడాదిన్నర కాలంలో.. మూడో విడత పర్యటనలకు బయలుదేరారు. కానీ.. ఇంత వరకూ.. ఒక్కటంటే.. ఒక్క నిఖార్సైన మిత్రపక్షాన్ని కూటమిలోకి తీసుకు రాలేకపోయారు. దీనికి ప్రధానమైన కారణం… భారతీయ జనతా పార్టీ తరపున కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరగడమే. అందుకే.. కేసీఆర్ ఇప్పుడు వ్యూహం మార్చారు. సరికొత్త సందేశాన్ని జాతీయ మీడియా ద్వారా..పార్టీలకు పంపారు.
అవసరం అయితే ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కాంగ్రెస్ పార్టీకే..!
డీఎంకేను… ఫెడరల్ ప్రంట్ కూటమిలోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి.. విఫలమయిన కేసీఆర్.. మరికొంత మంది మిత్రుల వద్దకు వెళ్లి … మద్దతు సంపాదించాలంటే.. అన్నిటి కంటే ముఖ్యంగా.. తనపై ఉన్న బీజేపీ ముద్రను చెరేపేసుకోవాలనుకుంటున్నారు. ఎన్ని పార్టీల్ని కూడగట్టి చిట్టచివరికు తీసుకెళ్లి బీజేపీకే మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం నమ్మకంగా జరగడంతో.. కేసీఆర్… కూటమి వైపు రావడానికి పార్టీలు అంగీకరించడం లేదు. అందుకే… తన పార్టీ నేత అబిద్ రసూల్ ఖాన్ ద్వారా.. జాతీయ మీడియాకు ఓ సందేశం పంపారు. అదేమిటంటే.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా… ఫెడరల్ ప్రంట్ బీజేపీకి మద్దతుగా ఉండబోదని.. అవసరమైన పక్షంగా… కాంగ్రెస్ కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామనేది.. ఆ సందేశం సారాంశం.
కాంగ్రెస్ గాలంతో కొత్త మిత్రులు దొరుకుతారా..?
కేసీఆర్ మొదటి నుంచి.. కొన్ని ప్రత్యేకమైన పార్టీల నేతలను మాత్రమే కలుస్తున్నారు. కేసీఆర్ కలుస్తున్న పార్టీల నేతలు.. కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటున్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉన్న వారు లేదా.. కాంగ్రెస్ కూటమికి దగ్గరగా ఉన్నవారు అయి ఉంటున్నారు. బీజేపీ మిత్రపక్షాలను ఏ మాత్రం కలవడం లేదు. దాంతో.. బీజేపీకి బీ టీం అనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పార్టీలు.. ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధపడటం లేదు. అందుకే… తన కూటమి కాంగ్రెస్‌కే మద్దతిస్తుందని.. కొత్త ప్రకటనలు చేస్తున్నారు. దాని వల్ల… కాంగ్రెస్ కూటమిలో చేరలేని పార్టీలు తమ కూటమిలో వస్తాయని.. భావిస్తున్నారు. తర్వాత తాము అయినా కాంగ్రెస్ కే మద్దతిస్తాం కాబట్టి.. కూటమిలోకి వచ్చినా తప్పు లేదని.. ఆయా పార్టీలను కన్వీన్స్ చేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తదురపరి పర్యటనలు కీలకం..!
బీజేపీ మద్దతు తీసుకోవడం కానీ… బీజేపీకి మద్దతివ్వడం కానీ జరగదని జాతీయ మీడియాకు సమాచారం ఇచ్చిన తర్వాత కేసీఆర్.. త్వరలో.. కొన్ని కీలక పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. నవీన్ పట్నాయక్. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్‌లతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా… కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. వీరితో కలిసి ఫెడరల్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేయగలిగితే… కేసీఆర్ ప్రయత్నాలు ఫలించినట్లే. అయితే.. ఆ తర్వాత ఆ కూటమి… ముందుగా చెప్పినట్లు… కాంగ్రెస్‌కే మద్దతిస్తుందా.. లేదా కాంగ్రెస్ మద్దతే తీసుకుంటుందా.. అన్నది మాత్రం చెప్పలేం. అప్పటి రాజకీయ పరిస్థితులు… నిర్ణయాలకు దారి తీయవచ్చు.