ఆరు దశల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతా దేశంలో రాజకీయ పరిస్థితులపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల నుంచే తదుపరి ప్రధాని రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో మోడీ వేవ్ స్పష్టంగా ఉంది. ఈ సారి ఎలాంటి వేవ్ లేదు. కానీ.. మోడీపై వ్యతిరేకత మాత్రం ఉంది. అందుకే.. ఈ సారి ప్రాంతీయ పార్టీల నుంచి ప్రధానమంత్రి అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ అండ్ ఫ్రెండ్స్‌కు ఫ్రెండ్లీ ఎలక్షన్స్..!
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ తరహా కూటమి రాజకీయాలు దాదాపు ఖాయమనే అంచనా… అన్ని పార్టీల్లోనూ వచ్చింది. ఉత్తరప్రదేశ్ సహా ఈశాన్య, తూర్పు, దక్షిణ భారత్‌లో ప్రాంతీయ పార్టీలు బలంగా మారడం.. ఆ పార్టీలకే.. అత్యధిక సీట్లు వస్తాయన్న.. అంచనాలతో… ప్రధానమంత్రి ఆశావహులు.. సహజంగానే పెరిగిపోయారు. ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే.. కూటమి ప్రభుత్వాలే కీలకం. ఎన్నికల తర్వాత మూడు రకాల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాటిలో …ఒకటి బీజేపీ మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. రెండు కాంగ్రెస్ పార్టీ మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..! మూడు… బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతుతో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..!.
కర్ణాటక తరహా ఫార్ములానే అందరికీ కావాలి..!
ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటి వరకూ కూటమిగా ఏర్పడలేదు. కానీ… అన్ని పార్టీలను సమైక్యంగా ఉంచడానికి.. చంద్రబాబు లాంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, లెఫ్ట్ , బీజేడీ, టీడీపీ, టీఆర్ఎస్, లాంటి పార్టీలన్నీ కలిపి .. రెండు వందల సీట్లు గెలుచుకుంటాయన్న అంచనా ఉంది. అదే జరిగి.. అన్ని పార్టీలు ఒకే వేదిక కిందకు వస్తే.. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతివ్వక తప్పని పరిస్థితి వస్తుంది. కర్ణాటకలో 38 అసెంబ్లీ సీట్లు వస్తేనే కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే.. దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీకి అధికారం దక్కనీయకూడదన్న ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ పార్టీ.. తను సాధించిన సీట్లలో సగం కూడా గెలుపొందని జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది. ఢిల్లీ రాజకీయాల్లోనూ కర్ణాటక పరిస్థితి ఉండే అవకాశం ఉంది..
మోదీకి మద్దతిచ్చేందుకు ఎన్టీఏ పార్టీలు కూడా నాట్ రెడీ…!
బీజేపీకి, ప్రధానమంత్రి నేరంద్రమోదీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. బద్దశత్రువుల్లాంటి పార్టీలను కూడా బీజేపీ వ్యతిరేకతే ఏకం చేసింది. కాంగ్రెస్ కు అధికారం ఇవ్వకూడదని బీజేపీ.. బీజేపీకి అధికారం ఇవ్వకూడదని.. కాంగ్రెస్ రెండూ పోటీ పడి.. ప్రాంతీయ పార్టీల నేతలకు ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేయవచ్చు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమైతే.. వాటి తరపున ప్రధానమంత్రి అయ్యే వారికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ .. కన్నా కాంగ్రెస్‌నే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేసులో ప్రదానంగా ఉన్నారు.
మోడీ కి నో “వే”..!
ఒక్కటి మాత్రం క్లియర్.. మోడీ వేవ్ మాత్రం లేదు. అధికారంలోకి రావాలంటే… అద్భుతంగా జరగాలి. అలాంట అద్భుతంగా జరిగే పరిస్థితి లేదు. ఆ పార్టీ తేడా వస్తే ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమని.. ఇప్పటికే ఫీలర్స్ పంపారు. ఏ ప్రాంతీయ పార్టీతోనూ… బీజేపీ సన్నిహిత సంబంధాలు కొనసాగించడం లేదు. అందుకే.. ఆ పార్టీ మద్దతు ఇస్తామన్నా.. కాంగ్రెస్ వైపు విపక్షపార్టీలు మొగ్గుతాయి. అందుకే.. ఈ సారి మోదీకి నో వే.. అన్నది విశ్లేషణల్లో తేలుతున్న సత్యం..!