తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలు ఏమౌతున్నాయో చూస్తున్నాం. భాజపా, కాంగ్రెసేతర కూటమి అసాధ్యమని డీఎంకే అధినేత స్టాలిన్ నిష్కర్షగా తేల్చి చెప్పేశారు. గతంలో మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ లు కూడా కేసీఆర్ ప్రతిపాదనకి మద్దతుగా మాట్లాడిందీ లేదు. అయినాసరే, కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తారన్నది అందరి తెలిసిందే. కనీస వంద సీట్లను ఒక కూటమిలోకి చేర్చాలనేది ఆయన లక్ష్యం. అయితే… కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నంపై సాక్షి పత్రిక గడచిన రెండు రోజులుగా కథనాలు రాస్తోంది. ఫెడరల్ ఫ్రెంట్ పై స్టాలిన్ కి ఆసక్తి లేకపోయినాసరే, ఉందని ఈ పత్రిక మాత్రమే చెప్పింది! ఇక, ఇవాళ్టి పత్రిక విషయానికొస్తే… ఢిల్లీని గెలుద్దాం అంటూ ఓ కథనం రాసింది.
ఆ దిశగా కేసీఆర్ కార్యాచరణ ముమ్మరం చేశారనీ, త్వరలోనే ఆంధ్రా ఒడిశా యూపీ బెంగాల్ వెళ్లాలని నిర్ణయించారన్నారు. వీలైనన్ని రాష్ట్రాల్లో పర్యటించి, ఆ తరువాత ఢిల్లీలో కూటమి ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారట! ఫెడరల్ ఫ్రెంట్ కోసం గడచిన ఏడాదిగా కేసీఆర్ అలుపెరుగని కృషి చేస్తున్నారన్నారు. తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, బీఎస్పీ, ఎస్పీ, జేడీఎస్ లతో ఇప్పటికే ఓ దశ చర్చలు జరిపారనీ మరో దశ చర్చలకు వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నట్టు సాక్షికి తెలిసిందని రాశారు. సరే, గతంలో ఈ పార్టీలతో చర్చల సందర్భంగా వారు కేసీఆర్ ప్రతిపాదనపై ఎలా స్పందించారనేది అందరికీ తెలిసిందే.
ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజకీయ ప్రయత్నాలను సాక్షి ఏ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తోందో ఒక్కసారి గమనించాలి. అచ్చంగా ఇదే తరహా ప్రయత్నం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు కదా! భాజపా వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకే కదా…. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లలో పర్యటించి, ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఈవీఎంల పనితీరుపై పోరును కూడా ముందుకు తీసుకెళ్లారు. అయితే, చంద్రబాబు చేసిన ఈ ప్రయత్నాన్ని సాక్షి ఏమని విమర్శించిందీ… అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోతున్నారూ, ఆ భయంతోనే జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నుంచి కొంత మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని! కేసీఆర్, చంద్రబాబు… ఇద్దరి ప్రయత్నాలూ దాదాపు ఒకటే. కానీ, సాక్షి వైఖరి ఎలా ఉందంటే… కేసీఆర్ ప్రయత్నం ఢిల్లీని గెలిచేందుకు, చంద్రబాబు ప్రయత్నం ఓటమికి సాకును వెతుక్కునేందు అన్నట్టుగా!
వాస్తవం మాట్లాడుకుంటే… తొలివిడతలోగానీ, మలి విడతలో కేరళ, తమిళనాడు వెళ్లొచ్చినాగానీ… కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాల్లో పురోగతి కనిపించడం లేదు. జాతీయ పార్టీల ప్రమేయం లేని ఫ్రెంట్ కి మేం సిద్ధమని ఘంటాపథంగా చెప్పిన పార్టీ ఒక్కటీ లేదు. ఆ కోణాన్ని సాక్షి విశ్లేషించదు. చంద్రబాబు చేసిన ప్రయత్నం కొంత వర్కౌట్ అయింది. అందుకే, ఆయనకి మద్దతుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి జాతీయ నాయకులు వచ్చారు. దీన్ని సాక్షి ప్రస్థావించదు..!