చివరి దశ ఎన్నికలు కూడా త్వరలో అయిపోతాయి కాబట్టి, ఇక ఎగ్జిట్ పోల్స్ బయటకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 19తో ఎన్నికల కోడ్ కూడా పోతుంది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కసారిగా గుప్పుమంటాయి. మీడియలో హడావుడి మొదలౌతుంది. ఇదే విషయమై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఎగ్జిట్ పోల్ సర్వేలను చూసి ఎవ్వరూ కంగారుపడొద్దన్నారు! అవి ఎలా ఉన్నా అంతిమంగా 23న వచ్చే ఫలితాలు వేరే రకంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ, దాన్లో ఎలాంటి అనుమానం లేదనీ, ఫలితాలకు ముందుగా రాబోయే కొన్ని సర్వేలూ ఎగ్జిట్ పోల్స్ హడావుడి కొంత ఉంటుందనీ పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం.
ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా సర్వేల పేరుతో హల్ చల్ జరుగుతోంది. వైకాపా అధికారంలోకి రావడం ఖాయమంటూ ఆ పార్టీ నేతలు, మద్దతుదారులు హడావుడి చేస్తూనే ఉన్నారు. దానికి ధీటుగా టీడీపీ కూడా కొన్ని అంతర్గత సర్వేల సమాచారం తమకు అనుకూలంగా ఉందనే ధీమాతో వారూ ఉన్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒకింత చర్చకు దారి తీశాయనే చెప్పాలి. అంటే, రాబోయే ఎగ్జిట్ పోల్స్ వైకాపాకి అనుకూలంగా ఉంటాయని ఆయన అంతర్లీనంగా చెప్పినట్టే అనేది కొందరి అభిప్రాయం. టీడీపీకి వ్యతిరేకంగా ఇవి ఉంటాయని ముందు చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టయింది.
ఎగ్జిట్ పోల్స్ పై ముందుగానే చంద్రబాబు స్పందించడం ఓరకంగా టీడీపీ శ్రేణులకు కొంత జోష్ తగ్గించిన పరిణామాణంగానూ చూడొచ్చు. సీఎం వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైకాపా మద్దతుదారులు రకరకాల వ్యాఖ్యానాలు మొదలుపెట్టేశారు! ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండవు అన్నారు… రేప్పొద్దున్న ఎన్నికల ఫలితాలు కూడా ఇలానే ఉంటాయని అంటారంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు మొదలైపోయాయి. ఎగ్జిట్ పోల్స్ పై అవి వచ్చినప్పుడే మాట్లాడి ఉంటే బాగుండేదని కొంతమంది వ్యాఖ్యానిస్తే… పార్టీ వర్గాలు నిరుత్సాహంలోకి వెళ్లిపోతాయన్న అభిప్రాయంతోనే ముందుగానే ఆయన వ్యాఖ్యానించారని సమర్థించే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి అనుకూలంగా ఉండవని చంద్రబాబు ఏ ప్రాతిపదిక ఒక అభిప్రాయానికి వచ్చారనేది కూడా ఒక ప్రశ్నే..?