ఏపీ కేబినెట్ సమావేశం జరగనంత వరకూ… జరుగుతుందా లేదా, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తుందా రాదా అనే చర్చ జరిగింది. అయితే, ప్రభుత్వం అనుకున్నట్టుగానే సమావేశం జరిగిన తరువాత కూడా కేబినెట్ భేటీ అంశం ఇంకా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గానే ఉంది. దానికి కారణం… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వ్యవహరించిన తీరు! కేబినెట్ భేటీ ముందు పరిస్థితిని చూసుకుంటే…. ఎన్నికల తరువాత ఈసీ వెర్సెస్ చంద్రబాబు ఒక అంశమైతే, చంద్రబాబు వెర్సెస్ సీఎస్ అన్నట్టుగా ఇంకో అంశం చర్చనీయం అవుతూ వచ్చింది. కొన్ని నిర్ణయాల విషయంలో ఇద్దరి మధ్యా కొంత దూరం పెరిగింది. అయితే, కేబినెట్ భేటీకి వచ్చేసరికి… ఆ దూరం అస్సలు కనిపించలేదు. పైగా, ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కూడా. ఇప్పుడు ఇదే చర్చ ఇంకా జరుగుతోంది. ఈ ఇద్దరినీ కలిపిందెవరు..? ఎవరి చొరవతో పరిస్థితి ఇలా మారిందనే ప్రశ్నలకు సమాధానం… మంత్రి నారా లోకేష్ అని వినిపిస్తోంది.
ముఖ్యమంత్రికీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగేందుకు సచివాయలంలోని ఓ ఇద్దరి తీరే కారణం అనే గుసగుసలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో సీఎస్ మీద విరుచుకుపడేందుకు కొంతమంది మంత్రులు కూడా బాగా ప్రిపేపర్ అవుతున్నారన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. దీంతో కేబినెట్ సమావేశం జరుగుతుందా, జరిగితే సీఎం, సీఎస్ ల మధ్య పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున మొదలైంది. సరిగ్గా ఈ సమయంలోనే మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం, సీఎస్ ల మధ్య పెరుగుతున్న దూరాన్ని సరిచేయడం కోసం ఆయనే రంగంలోకి దిగారట! నిజానికి, ఎల్వీ సుబ్రమణ్యంతో నారా లోకేష్ కి మంచి చొరవే ఉన్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలులో ఎల్వీ కీలక పాత్ర పోషించారట. నిరుద్యోగ భృతి పథకం అమలు విషయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారట. దీంతో ఆయనతో ఎక్కువసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఆ సందర్భంలోనే ఇద్దరి మధ్యా మంచి స్నేహం కుదిరిందని అంటున్నారు. ఈ చొరవతోనే అటు ముఖ్యమంత్రి సూచనల ప్రకారం, సీఎస్ తో మాట్లాడారనీ, పెరిగిన ఈ దూరానికి, బయట జరుగుతున్న ప్రచారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని నారా లోకేష్ చొరవ తీసుకున్నట్టు సమాచారం. దీంతో అనూహ్యంగా కేబినెట్ సమావేశం చాలా కూల్ గా జరిగిందని తెలుస్తోంది.