ఈమధ్య దర్శకులంతా సెకండాఫ్ దగ్గరే బోల్తా పడుతున్నారు. లైన్ చెప్పి హీరోలతో ఓకే చేయించుకున్న దర్శకులు.. స్క్రిప్టు వరకూ వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. సెకండాఫ్ దగ్గర ఆగిపోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఇదే పరిస్థితి. గీతా ఆర్ట్స్ దగ్గర ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇంత వరకూ కథని సిద్ధం చేయలేదు. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఇలాంటి పాట్లే పడుతున్నాడు. అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ ఓ సినిమా సెట్ చేసింది. ఈపాటికే ఈ చిత్రం పట్టాలెక్కాలి. కానీ… సెకండాఫ్ విషయంలో ఓ క్లారిటీ రాలేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగా రాసుకున్న భాస్కర్… ఇంట్రవెల్ దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ కథని నడపడంలో ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. ఒకరిద్దరు రైటర్లని తీసుకొచ్చి, కూర్చోబెట్టినా సెకండాఫ్ తేలడం లేదని టాక్. అందుకే ఈ సినిమా ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదని సమాచారం. ‘ముందు చేతిలో ఉన్న సీన్లు తీసేద్దాం’ అని భాస్కర్ తొందరపడుతున్నా… అల్లు అరవింద్ మాత్రం ఈ ప్రాజెక్టుకి పచ్చ జెండా ఊపడం లేదని తెలుస్తోంది. ‘కాంగారేం లేదు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధమయ్యాకే మొదలెడతాం’ అంటున్నాడట. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఆఫీసులో సెకండాఫ్ కోసమే కుస్తీలు జరుగుతున్నాయి. అదెప్పటికి తేలుతుందో చూడాలి.