మరో రెండ్రోజుల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ సాధారణంగానే పార్టీలతో పాటు ప్రజల్లోనూ కొంత ఉంటుంది. అయితే, వైకాపా నేతలు ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ధీమాగా ఉన్నారు. ఎందుకంటే, అవి తమకే అనుకూలంగా ఉంటాయని, టీడీపీకి కొంత నిరాశ తప్పదని సీఎం చంద్రబాబు నాయుడే తేల్చి చెప్పేశారన్న జోష్ కొంత వారిలో ఉంది. దీంతోపాటు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా అదే తరహా ధీమాతో ఉన్నాయి వైకాపా వర్గాలు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ, అందుకే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న పార్టీ ఆఫీస్ ని అమరావతికి శాశ్వతంగా జగన్ తరలించేస్తున్నారంటూ వైకాపా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు, వైకాపా నేతలకు కూడా జగన్ నుంచి ఆదేశాలు వెళ్లాయనీ, అందరూ అమరావతికి పూర్తిస్థాయిలో తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారని సమాచారం.
ఎన్నికలు జరిగిన మర్నాటి నుంచే వైకాపా అధికారంలోకి వచ్చేస్తుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు తెరమీదికి తెచ్చారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు కూడా కొంత వెనకబడ్డాయి. ఆ తరువాత, రకరకాల మాధ్యమాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమాచారం తెప్పించుకున్నారనీ కథనాలు వచ్చాయి. దాంతో గెలుపు ఖాయమని ఆయనే స్వయంగా చెప్పేసరికి టీడీపీ వర్గాల్లో కూడా ఉత్సాహం పెరిగింది. దీంతో రెండు పార్టీలూ ఎవరికి వారు ఇప్పుడు గెలుపు ధీమాతో కనిపిస్తూ వస్తున్నారు. అయితే, వైకాపా వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే… ఎన్నికల జరిగాక ఇప్పటివరకూ ఐదుసార్లు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించారని అంటున్నారు.
ఎన్నికలు అయిన వెంటనే ఒక సర్వే చేయిస్తే… దాన్లో కొంతమంది ప్రముఖ వైకాపా నేతల గెలుపుపై కొంత అనుమానాస్పద సమాచారం వచ్చిందిట! ఆ తరువాత, మరో దఫా సర్వే చేయించి… ఈసారి పెద్ద సంఖ్యలో నమూనాలు సేకరించారట. దీంతో మరింత స్పష్టత వచ్చిందనీ, నగరి, రాప్తాడు నియోజక వర్గాల్లో వైకాపా గెలుపుపై ధీమా వ్యక్తమైందని తెలుస్తోంది. ఇలాగే, ప్రాంతాలవారీగా అంచనాలకు కాస్త భిన్నంగా ఉన్నచోట్ల సర్వే నమూనాల సంఖ్యను పెద్ద సంఖ్యలో పెంచి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిపై జగన్ అంచనాకి వచ్చారట! ఇలా ఐదుసార్లు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అంతిమంగా వైకాపాకి 100కు పైగా సీట్లు రాబోతున్నాయన్న ధీమాకి పార్టీ వర్గాలు వచ్చినట్టు తెలుస్తోంది. మరి, అంచనాలకు తగ్గట్టుగానే ఓటర్లు తీర్పు ఇచ్చారా లేదా అనేది 23న తేలిపోతుంది.