టీవీ9 లో “అన్వేషణ” అని ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. చాలా రోజులుగా మనకు కనిపించకుండా పోయిన ఆర్టిస్టులను, ఒకప్పటి సెలబ్రిటీలను ఈ ప్రోగ్రాంలో టీవీ నైన్ టీం అన్వేషించి, వారి ఆచూకీ కనుక్కొని, వారిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. గత కొద్దిరోజులుగా కనిపించకుండాపోయిన/ అజ్ఞాతంలో ఉన్న/ పరారీలో ఉన్న/ రవి ప్రకాష్ ఆచూకీ ని కూడా టీవీ9 అన్వేషణ టీం వాళ్లు కనుక్కుంటే బాగుంటుందని ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ క్రమంలో, ఈ రోజు రవి ప్రకాష్ – శివాజీ ల మధ్య జరిగిన కొన్ని ఇమెయిల్స్ సంభాషణలు, మరికొన్ని కీలక వివరాలు పోలీసులకు లభించాయనే వార్తలు ఇతర చానల్స్ తో పాటు, టీవీ9 లో కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు తెర వెనుక ఏం జరుగుతోంది, అసలు వాస్తవాలు ఏంటి అని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. టీవీ 9 పరిభాషలో చెప్పాలంటే, ఏది వైరల్ ఏది రియల్ అన్న అనుమానాలు ప్రజలలో ఉన్నాయి.
ఈ మెయిల్స్ ద్వారా పోలీసులకు ఏం తెలిసింది?
శివాజీ – ఆపరేషన్ గరుడ తో సహా ఏ అంశం గురించి మాట్లాడినా గతంలో టీవీ9 విపరీతంగా హైలెట్ చేసేది. అసలు శివాజీ ను టీవీ9 ఎందుకంత హైలెట్ చేస్తుంది అన్న సందేహాలు ప్రజల్లో ఉండేవి. టీవీ9 అమ్మకం వివాదం పుణ్యమా అని ఆ ముసుగు తొలగి పోయింది.
అయితే శివాజీ, రవి ప్రకాష్ ల మధ్య షేర్ల బదలాయింపు సంబంధించిన వ్యవహారంలో కొత్త వాస్తవాలు పోలీసులకు తెలిసాయి అని వార్తలు వస్తున్నాయి. 2019 ఏప్రిల్లో రవి ప్రకాష్ శివాజీ ల మధ్య ఒక ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందం ప్రకారం 40 వేల షేర్లను రవి ప్రకాష్ శివాజీకి బదిలీ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఈ ఒప్పందం 2018 ఫిబ్రవరిలోనే జరిగినట్లుగా రవి ప్రకాష్ బృందం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
ట్రిబ్యునల్ లో కేసు దాఖలు చేసేందుకే ఈ నకిలీ అగ్రిమెంట్ సృష్టించారా?
అయితే ఈ ఈమెయిల్స్ ని రవి ప్రకాష్ బృందం డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో రిట్రీవ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈమెయిల్ చైన్ వ్యవహారంలో, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ శివాజీ లతోపాటు, టీవీ9 మాజీ డైరెక్టర్ మూర్తి, మోజో టీవీ కి చెందిన హరి, అలాగే శక్తి అనే మరొక వ్యక్తి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అయితే పాత తేదీలతో ఈ నకిలీ ఒప్పందం సృష్టించాల్సిన అవసరం ఏం వచ్చిందని విచారిస్తే, కేవలం టీవీ9 అమ్మకం ప్రక్రియ మీద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఏదో ఒక రకమైన కేసు వేసి ఆ అమ్మకం ప్రక్రియను సాంకేతిక కారణాలతో రద్దు చేయించాలనే కుట్రతోనే రవి ప్రకాష్ ఈ నకిలీ ఒప్పందాన్ని సృష్టించాడని కొందరు అంటున్నారు. శివాజీ ఈ అమ్మకం ప్రక్రియ మీద ఇప్పటికే ట్రిబ్యునల్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. పైకి శివాజీ రవిప్రకాష్ కు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ ని ఆశ్రయించినట్లు గా చెబుతున్నప్పటికీ, శివాజీ అసలు ఉద్దేశం రవి ప్రకాష్ కు మేలు చేసేలా టీవీ9 అమ్మకం ప్రక్రియను సాంకేతిక కారణాలతో రద్దు చేయించాలనే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొనసాగుతున్న “అన్వేషణ”
ప్రస్తుతానికైతే పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రవి ప్రకాష్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సెక్షన్ 41 కింద పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉండడం వల్ల, ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి పోలీసులు అరెస్టు చేయడం ద్వారానో, లేదంటే రవిప్రకాష్ తనకు తాను లొంగిపోవడం ద్వారానో, మొత్తానికైతే రవి ప్రకాష్ పోలీసుల ముందుకు వచ్చి విచారణ కు హాజరై వివరణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాత తేదీతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం కార్పొరేట్ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం కావడంతో, రవిప్రకాష్ కు చట్ట ప్రకారం శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి ముందు ముందు ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.