టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ సారి జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకూడదని.. ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూండటంతో.. ఆయన ఇరవై మూడు తర్వాత ఢిల్లీలోనే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఓ పదిహేను రోజుల పాటు సంకీర్ణరాజకీయాల కోసం… చంద్రబాబు ఢిల్లీ వేదికగానే… వ్యవహారాలు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే… అందర్నీ సమన్వయం చేయడంలో చంద్రబాబును మించిన నేత లేదు. ఆయన అవసరం … సంకీర్ణ రాజకీయాల్లోనే ఎక్కువగా ఉంటుంది. హంగ్ వస్తే మాత్రం.. చంద్రబాబు.. ఏపీ రాజకీయాలను పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉండదు.
తనకు.. ప్రధాని పదవిపై ఆశ లేదన్న చంద్రబాబు… ఏపీలో టీడీపీ గెలిస్తే.. మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. కేంద్ర రాజకీయాల కారణంగా.. 23వ తేదీన ఫలితాల్లో చంద్రబాబు విజయం సాధించినా.. రెండో సారి ప్రమాణస్వీకారం మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితం… చంద్రబాబు.. 2014లో తాను జూన్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేశాను కాబట్టి.. అక్కడి వరకు తనకు పదవీ కాలం ఉందని చెప్పారు. ఓడిపోతే.. ప్రజావిశ్వాసం కోల్పోయారు కాబట్టి రాజీనామా చేస్తారు. కానీ.. మళ్లీ ప్రమాణస్వీకారం చేయాల్సింది తనే కాబట్టి… ఆయనకు తొందరేం ఉండదు. జూన్ ఎనిమిదో తేదీ వరకు వెయిట్ చేయవచ్చు. ఈ లోపు జాతీయ రాజకీయాలను.. చక్కబెట్టవచ్చు.
ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు పార్టీ కార్యక్రమాలను కూడా.. మేనేజ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును రద్దు చేసింది. ఎన్నికల ఫలితాలకు.. మహానాడు నిర్వహణకు మధ్య కేవలం మూడ్రోజుల సమయం మాత్రమే ఉంది. గెలిస్తే.. జరిగే హడావుడి వేరుగా ఉంటుంది. దాని వల్ల మహానాడు లాంటి తీరుబడి కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యం. ఓడిపోతే… ఆ షాక్‌లో.. మహానాడు నిర్వహణ అసలు సాధ్యం కాదు. అందుకే చంద్రబాబు తెలివిగా… మహానాడును ఈ సారికి రద్దు చేసేశారు. ఎన్టీఆర్ జయంతి రోజున మే 28వ తేదీన పగలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి అదే మహానాడుగా అనుకోవాలని చంద్రబాబు పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.